
– రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక్క గుంట కూడా కబ్జా లేదు
– ఆర్ఎఫ్సీపై రాజశేఖర రెడ్డి దాడి చేస్తే నేనే అడ్డుకున్నా
– సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
వరంగల్ , ప్రతినిధి : రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నేస్తానన్న కేసీఆర్ వరంగల్ లో దీనిపై స్పందించారు. నేనలా ఎప్పుడు అనలేదని సమాధానమిచ్చారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఒక్క గుంట ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఫిల్మ్ సిటీలోని ప్రతి అంగుళాన్నీ కొనుగోలు చేశారని చెప్పారు. రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నుతానని తాను ఎన్నడూ అనలేదని అన్నారు. ఫిల్మ్ సిటీ ఒక అద్భుతమని కితాబునిచ్చారు. ఆంధ్రాతో సహా ఎక్కడి నుంచి వచ్చినా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతామని స్పష్టం చేశారు.
నాలుగు రోజులుగా వరంగల్ నగరంలో బస చేసిన సీఎం కేసీఆర్… మురికివాడల్లో విస్తృతంగా పర్యటించారు.చివరి రోజైన ఆదివారం తాను బస చేసిన మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాస గృహంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక విలేకరి రామోజీ ఫిల్మ్ సిటీ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నుతానని ఉద్యమ సమయంలో చెప్పిన మీరు.. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ఇప్పుడు మాట మార్చారెందుకని ప్రశ్నించారు. దీంతో ఆ విలేకరిపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ కేసీఆర్ ఎప్పుడన్నా అన్నాడా… రామోజీ ఫిల్మ్ సిటీ దున్నుతానని? రామోజీ ఫిల్మ్ సిటీ నిజంగానే అద్భుతం. ఒక్క గుంట కూడా ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టలేదు. ఆయన గవర్నమెంట్ ల్యాండ్‌ను అక్వయిర్ చేయలేదు. ఎవ్రీ ఇంచ్ హాజ్ పర్చేజ్డ్. నేనొక సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీకి పోతే నాకు చూపించిండయ్యా! అసైన్డ్ భూములు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తే.. ‘దళితులకు చెందిన పదమూడున్నర ఎకరాల అసైన్డ్ భూమిని కొన్నారు మావాళ్లు తెలియక. నేను కాంపౌండ్ వాల్ తీసేసి వాళ్లది వాళ్లకప్పజెప్పిన. డబ్బులు కూడా తీసుకోలేదు’ అని చెప్పిండు’’ అని వివరించారు. రామోజీ రూ.4 వేల కోట్లతో ఓం సిటీ కట్టబోతున్నాడని, అది పూర్తయితే రోజుకు లక్షమంది విజిటర్స్ వస్తారన్నారు. ‘‘గొప్ప సంస్థను యాడ్ చేస్తున్నప్పుడు వాళ్లు ఎవరైతే ఏమిటండీ! ఎందుకు వద్దంటాం?’’ అని ప్రశ్నించారు.