
విశాఖపట్నం, ప్రతినిధి : సున్నా డిగ్రీలకు చేరుకున్న చలికి జనం గజగజ వణికిపోతున్నారు. ఎన్నడూ లేనంత రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎప్పుడూలేని విధంగా తొలిసారి సున్నా డిగ్రీలకు చేరింది. మరోవైపు వారంరోజుల పాటు ఇలాంటి పరిస్థితి తప్పదని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో జీరో డిగ్రీలు నమోదయ్యాయి. ఇదే జిల్లాలోని పాడేరు, చింతపల్లి, కొయ్యారు వంటి హిల్స్ ప్రాంతాల్లో చలి 3 డిగ్రీలకు చేరింది. గతంలో ఎన్నడులేని విధంగా ఆయా ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తోంది. ఉత్తరాదిలో మాత్రమే నమోదయ్యే ఇంత భారీ చలి, ఏపీలో రావడం చాలా అరుదు.
అటు తెలంగాణలోని ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలకు పడిపోయింది. నిజామాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మెదక్‌ల్లో 5 డిగ్రీలకు చేరింది. ఎముకలు కొరికే చలి, దట్టంగా కమ్మేసిన మంచుతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా 8 డిగ్రీలుగా నమోదయిన ఉష్ణోగ్రతలు, రెండురోజుల కిందట సగానికి సగం పడిపోయాయి. ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది.