రైల్వే అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చర్చలు

రైల్వే అధికారులతో సానుకూలంగా ఉప ముఖ్యమంత్రి చర్చలు

పనులు వేగవంతంగా చేయడానికి రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ అంగీకారం

వరంగల్ రైల్వే పనులపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్, చైర్మన్లు అధికారులతో సమావేశం

వరంగల్ లో రైల్వే స్కూల్ పునరుద్ధరించాలని ఉప ముఖ్యమంత్రి

రైల్వే ఆస్పత్రి నిర్వహణపై డిప్యూటీ సిఎం అసంతృప్తి..మెరుగుపర్చాలని విజ్ణప్తి

రైల్వే స్టేడియంను కూడా అభివృద్ధి పర్చాలని జీఎంను కోరిన ఉప ముఖ్యమంత్రి కడియం

వరంగల్, ఖాజీపేట స్టేషన్ల వద్ద రెండో ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం

సానుకూలంగా స్పందించిన రైల్వే జిఎం వినోద్ కుమార్యాదవ్, అధికారులు

హైదరాబాద్ : వరంగల్ లో రైల్వే శాఖకు సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్, చైర్మన్లతో కలిసి దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్ కుమార్ యాదవ్ తో రైల్ నిలయంలో నేడు సమావేశమయ్యారు. రైల్వేశాఖకు సంబంధించిన పలు పనులు ఆలస్యమవుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వీటిని వేగవంతంగా పూర్తి చేయాలని సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. ఉప ముఖ్యమంత్రి కోరిన అంశాలపై రైల్వే జిఎం వినోద్ కుమార్ యాదవ్ చాలా సానుకూలంగా స్పందించి వెంటనే అడిగిన పనులన్నింటిని పూర్తి చేయడానికి అంగీకరించారు. హన్మకొండ-ఖాజీపేట మధ్య ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జికి పక్కన సమాంతరంగా మరొక ఆర్వోబిని నిర్మించడానికి రైల్వే శాఖ అంగీకరించిన నేపథ్యంలో దీని నిర్మాణానికి అయ్యే 78 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కేసిఆర్ మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో ఈ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రైల్వే అధికారులను కోరారు.

ఈ ఆర్వోబి నిర్మాణానికి వెంటనే అనుమతి ఇస్తామని, రైల్వే శాఖ దీనిని చేపడితే ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఆర్ అండ్ బి శాఖ దీని పనులు చేయాలని రైల్వే జిఎం సూచించారు. ఆర్ అండ్ బి అధికారులు నిర్మించే ఈ ఆర్వోబికి కావాల్సిన అనుమతులన్ని వెంట వెంట ఇచ్చే విధంగా తాము సహకరిస్తామన్నారు. దీనికి ఆర్ అండ్ బి అధికారులు కూడా అంగీకరించడంతో ఆర్వోబి నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియకు రెండు శాఖల అధికారుల మధ్య సమన్వయం కుదిరింది. రైల్వే వ్యాగన్ల ఓవరాలింగ్ యూనిట్ పనులు వెంటనే ప్రారంభించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి రైల్వే అధికారులను కోరారు. అయితే ఈ యూనిట్ పనుల ప్రారంభానికి 160 ఎకరాల స్థలం కావాలని కోరారని, ఈ స్థలంకు సంబంధించి కోర్టులో కేసు ఉందని రైల్వే అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కోర్టులో ఈ స్థలంపై ఉన్న స్టేను వెంటనే ఎత్తివేయించి స్థలాన్ని అప్పగిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. స్థలం రాగానే పనులు ప్రారంభిస్తామని, దీనివల్ల స్థానికంగా 1000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. హంటర్ రోడ్డులో ఆర్వోబికి సంబంధించి ముఖ్యమంత్రి కేసిఆర్ 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినా.. ఆ పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా శివనగర్ రోడ్ అండర్ బ్రిడ్జికి అదనంగా నిర్మించే తోవ పనులు కూడా ఆలస్యమవుతున్నాయని రైల్వే అధికారులు దృష్టికి తీసుకురాగా..వెంటనే ఈ రెండింటిని తనిఖీ చేసి పనులు వేగవంతం చేస్తామని రైల్వే జిఎం వినోద్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు.

ఖాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల వద్ద రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వే అధికారులు అంగీకరించారు. ఖాజీపేట వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిని 50 శాతం రాష్ట్ర
నిధులు, 50 శాతం రైల్వే నిధులతో నిర్మించాలని డిప్యూటీ సిఎం ప్రతిపాదించగా, తమ వద్ద ఫిప్టీ, ఫిప్టీ నిధులతో నిర్మించే విధానాలు లేవని పూర్తిగా మేమే నిర్మించాలి, లేకపోతే మీరే వాటి ఖర్చు భరించాలని రైల్వే జిఎం చెప్పారు. దీంతో ఖాజీపేట వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిని రైల్వే శాఖ నిర్మిస్తే..వరంగల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జికి అయ్యే ఖర్చును కుడా నిధుల నుంచి నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి సూచించారు. దీనికి రైల్వే అధికారులు అంగీకరించడంతో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇక ఖాజీపేట వద్ద గతంలో ఉన్న రైల్వే శాఖ ఉన్నత పాఠశాలను మూసివేయడాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రైల్వే అధికారులను ప్రశ్నించారు. వెంటనే ఈ స్కూల్ ను పునరుద్ధరించాలని కోరారు. రైల్వే స్కూల్ ఉండడం వల్ల పేదలకు మేలు జరుగుతుందని చెప్పారు. అవసరమైతే ఈ ఉన్నత పాఠశాల నడిపించడానికి తమ పూర్తి సహకారం అందిస్తామన్నారు.అదేవిధంగా రైల్వే ఆస్పత్రి నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిని మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అక్కడే స్టేడియం ను కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఈ స్టేడియంను అభివృద్ధి చేయాలని కోరారు. వీటికి రైల్వే జిఎం సానుకూలంగా స్పందించి, వెంటనే వీటిని తనిఖీ చేసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరినట్లు పనులు చేస్తామని హామీ ఇచ్చారు.

ఖాజీపేట వద్ద రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా అభివృద్ధి చేశామని, రైల్వే ట్రాక్ వద్ద అది వెడల్పు చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని రైల్వే అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిని కూడా నాలుగు లేన్ల రోడ్డుకు అనుగుణంగా వెడల్పు చేయాలని కోరడంతో రైల్వే జిఎం అంగీకరించారు. అదేవిధంగా ఖాజీ పేట వద్ద బస్టాప్ ను కూడా మరింత అభివృద్ధి చేయాలన్న దానికి కూడా రైల్వే అధికారులను సానుకూలంగా స్పందించారు. బట్టలబజార్ దగ్గర రోడ్ అండర్ బ్రిడ్జిని ఆరు నెలల్లో పూర్తిచేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రైల్వే జిఎంను కోరారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన ఆర్వోబిలు, రోడ్ అండర్ బ్రిడ్జీలలో అనేక సమస్యలున్నాయని ఎంపీలు,
ఎమ్మెల్యేలు, మేయర్, చైర్మన్లు రైల్వే అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వీటిని వెంటనే తనిఖీ చేయించి, సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని రైల్వే జిఎం వినోద్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. మొత్తానికి రైల్వే అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చలు సానుకూలంగా జరిగాయని, రైల్వే అధికారులు తాము సూచించిన సమస్యలకు వెంటనే పరిష్కారాలు చేసే విధంగా స్పందించారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆర్ అండ్ బి అధికారులు కూడా రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే ఈ పనులు పూర్తి చేయాలన్నారు. రాబోయే ఆరు నెలల్లో ఆర్వోబిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేస్తారని హామీ ఇచ్చారన్నారు. అదేవిధంగా 160 ఎకరాల స్థలం అప్పగించగానే రైల్వే వ్యాగన్ల ఓవరాలింగ్ యూనిట్ పనులు ప్రారంభమవుతాయన్నారు.

ఈ సమావేశంలో ఎంపీలు సీతారాం నాయక్, పసునూరి రవీందర్, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, కొండా సురేఖా, మేయర్ నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వరంగల్ అర్భన్ కలెక్టర్ కాటా ఆమ్రపాలి, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ కమిషనర్ శృతి ఓజా, ఆర్ అండ్ బిఅధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.