రైతు పంటకు పెట్టుబడి పథకం అమలు జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

రైతు పంటకు పెట్టుబడి పథకం అమలు నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు, ఆర్.డి.ఓ.లు, జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

జనవరి, 23 న రైతు పంటకు పెట్టుబడి పథకం అమలు నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు, ఆర్.డి.ఓ.లు, జిల్లా వ్యవసాయ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్., భూపరిపాలన డైరెక్టర్ వి. కరుణ, ఐ.ఎ.ఎస్., వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్.,తో సహా రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు ఎన్.ఐ.సి. అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్. విడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్లు, ఆర్.డి.ఓ.లు, జిల్లా వ్యవసాయ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ భూ ప్రక్షాళన ముఖ్య ఉద్దేశ్యం రైతు పంటకు పెట్టుబడి పథకాన్ని అమలు చేయడమే అని అన్నారు. రెవెన్యూ శాఖ ఇచ్చే భూమి డాటాను అనుసరించే రైతులకు పాసు బుక్కులు అందచేయడం, సాగుకు పెట్టుబడి సహకార పథకం అమలు, అలాగే భవిష్యత్తులో రైతులకు అందజేయనున్న ఎటువంటి కార్యక్రమాలకైనా, పథకాల అమలుకైనా భూములకు సంబంధించిన డాటా చాలా కీలకమన్నారు.

రైతులకు అందించనున్న పంటకు పెట్టుబడిని చెక్కు రూపంలో రైతులకు అందించనున్నట్లు చెప్పారు. పాసు బుక్కుల్లో సమాచారం, రైతులకు చెక్కులు అందజేసినప్పుడు చెక్కుల్లో పేర్కొనే సమాచారం ఎక్కడా అంతరాలు లేకుండా డాటా పక్కాగా పొందుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన ఈ కార్యక్రమం వైపు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, విధానకర్తలు ఆసక్తితో గమనిస్తున్నారని అన్నారు. కాబట్టి రెవెన్యూ శాఖ అందజేసే భూమి డాటా అన్నిటికి కీలకం కానుందన్నారు. మండలాల సంఖ్య, గ్రామాల సంఖ్య, రైతుల ఖాతాల సంఖ్య, భూ విస్తీర్ణం వంటి సమాచారాన్ని చాలా పక్కాగా తయారు చేసుకోవల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ సభలు త్వరగా పూర్తి చేసి నూటికి నూరు శాతం డాటా కరెక్టుగా పొందుపర్చాలి. ఈ డాటా ఆధారంగానే బడ్జెట్ కూడా రూపొందనుంది.

అందువల్ల రైతు పేరుతో సహా భూమి విస్తీర్ణం ఎవరు అసలు యజమానులు అనే వివరాలు సక్రమంగా ఉన్నప్పుడే చెక్కుల పంపిణీ సులభమౌతుందని అన్నారు. ఎ.ఇ.ఓ. స్తాయి నుంచి డి.ఎ.ఓ. స్థాయి వరకు వ్యవసాయ అధికారులను, రెవెన్యూ శాఖ పనిలో భాగస్వామ్యం అయ్యేలా చూడమని జాయింట్ కలెక్టర్లను కోరారు. రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ భుజం భుజం కలిపి ముందుకు సాగాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు, ఆర్.డి.ఓ.లు, జిల్లా వ్యవసాయ అధికారులతో భూపరిపాలన డైరెక్టర్ వి. కరుణ, ఐ.ఎ.ఎస్. మాట్లాడుతూ భూ సమగ్ర సర్వేకు సంబంధించిన డాటా సేకరణలో సిబ్బంది అంతా చాలా కృషి చేసారని అభినందించారు.

ఇప్పటికే రైతులకు సంబంధించిన భూమి సమాచారం 93 శాతం పూర్తైందని మిగతా డాటా బేస్ పని ఏ మేరకు వచ్చింది, డాటాలో తప్పొప్పుల సవరణలు, చేర్పులు ఈ నేలాఖరు కల్లా పూర్తి చేయాల్సి ఉందని గుర్తు చేసారు. డాటా పొందుర్చడంలో క్షేత్ర స్థాయినుంచి వచ్చిన సందేహాలకు ఎన్.ఐ.సి. ప్రతినిధులు శివాజి, కృష్ణ లు స్పందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *