
హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీరు వదలకపోవం వల్ల జిల్లాలో రైతులు ఆందోళన చేసి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నరసింహులు అగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పంట నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఇంకో 15 రోజుల పాటు ఉండే ఖరీఫ్ కు 15 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా వదలాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీరు వదిలేలా కృషి చేయాలని కోరారు. పంటలు పండక పోతే జిల్లాలో పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని, ఈ పంటలు ఎండకుండ ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ర్టంలో రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.