
కరీంనర్: జిల్లాలో రైతులందరు సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని కరీంనర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేటు సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో ‘‘పరంపరాగత్ కృషి వికాస యోజన’’పధకం అమలుపై జిల్లా స్ధాయి కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పధకం క్రింద రైతులకు వంద శాతం సబ్సిడిపై జీవ ఎరువులు, జీవ కీటక నాశనులు, సేంద్రియ ఎరువులు ఇస్తారని తెలిపారు. కరీంనగర్ జిల్లాకు 8 యూనిట్లు మంజూరు అయ్యాయని, ఒక యూనిట్ కు 50 ఎకరాలు చొప్పున 400 ఎకరాలలో సేంద్రియ వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మండలం ఒక క్లస్టర్ గా గుర్తించి ఒక క్లస్టర్ లోని ఒక గ్రామంలో 50 మంది రైతులను ఎంపిక చేసి ఒక రైతు ఒక ఎకరం సేంద్రియ సాగు చేసేలా ప్రోత్సహించాలని అన్నారు. ముందుగా మట్టి నమూనాలు సేకరించి పరీక్షించి కార్డులు అందజేయాలని అన్నారు. జిల్లాలో ఇంత వరకు 375 మంది రైతుల భూసార పరీక్షలు చేసినట్లు తెలిపారు. సేంద్రియ సాగులో రైతులు ఎక్కువగా కూరగాయలు, పప్పు దినుసులు పండించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ పధకాన్ని జిల్లాలో పూర్తి స్ధాయిలో అమలు చేయుటకు కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి తేజోవలి, హర్డికల్చర్ డి.డి. శ్రీనివాస్ జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్ర్రవేత్త వెంకటేశ్వరరావు, డాట్ సైంటిస్టు అరుణ శ్రీ తదితరులు పాల్గొన్నారు.