రైతుబీమా పథకం ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

రైతుబీమా పథకాన్ని వరంగల్ లో ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

రైతులకు బీమా బాండ్ల పంపిణీ

రైతును రాజు చేయాలన్న సిఎం కేసిఆర్ సంకల్పంలో భాగమే ఈ రైతు బీమా

సిఎం కేసిఆర్ పాలన గురించి ప్రధాని, రాష్ట్రపతి కొనియాడుతున్నారు

సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో దేశం మొత్తం నేడు తెలంగాణవైపు చూస్తోంది

రైతుకు పెట్టుబడి కోసం రైతుబంధు కింద ఏటా రూ.12వేల కోట్లు ఖర్చు

రూ.800 కోట్ల నీటితీరువా బకాయిలు రద్దు..ఇకపై తీరువా లేదు

రైతుకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ తెలంగాణలోనే సాధ్యమైంది

ఎరువులు, విత్తనాలకు ఏనాడు కొరత లేకుండా చేసిన ఘనత సిఎం కేసిఆర్ ది

కళ్యాణలక్ష్మీ పథకం కింద ఆడపిల్ల పెళ్లికి 1,00,116 రూపాయలిస్తున్న ఏకైక ప్రభుత్వం

పేదింటి మహిళ గర్భం దాలిస్తే 12వేల రూపాయలు, కేసిఆర్ కిట్ ఇస్తున్నాం

ప్రజల సంతోషం కోసం పనిచేస్తున్న కేసిఆర్ ప్రభుత్వాన్ని నిండు మనసుతో దీవించాలి

రైతుబీమా పథకం ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

వరంగల్: వ్యవసాయాన్ని పండగ చేయాలి, రైతును రాజు చేయాలన్న సంకల్పంతో సిఎం కేసిఆర్ గత నాలుగేళ్లలో అనేక రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, వాటి ఫలితాలు రైతులకు అందుతున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు నేడు దేశం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షిస్తున్నాయన్నారు. వరంగల్ రూరల్ జిల్లా, దుగ్గొండి మండలం, తిమ్మంపేట గ్రామంలో రైతుబీమా పథకాన్ని ప్రారంభించి, రైతులకు బీమా బాండ్లను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అందించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 60 సంవత్సరాల పోరాటాల ఫలితంగా, అమరుల త్యాగాల ఫలితంగా, సిఎం కేసిఆర్ నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలంతా సంతోషంగా ఉండేలా సిఎం కేసిఆర్ పాలన కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎందుకోసం కావాలని చెప్పామో, నేడు తెలంగాణ వచ్చాక వాటన్నింటిని చేతల్లో చేసి చూపుతున్న ప్రభుత్వం ఇది అన్నారు. నాడు కరెంటు కోసం గోస పడ్డామని, రైతులు కరువుతో, కరెంటు లేక, విత్తనాలు-ఎరువులు అందక ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు. ఇది కేసిఆర్ పాలనలోనే సాధ్యమైందన్నారు. గత నాలుగు సంవత్సరాలలో ఏ ఒక్క రైతు కూడా ఎరువులు-విత్తనాల కోసం రోడ్డెక్కిన పరిస్థితి లేదన్నారు. సకాలంలో రైతులకు కావల్సిన విత్తనాలు-ఎరువులను అంచనా వేసి వాటిని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. తెలంగాణలో రైతు పంట పండించిన తర్వాత అమ్మడానికి వెళ్తే గిట్టుబాటు ధర లేకపోయినా…దానిని నిల్వచేసుకునే పరిస్థితి ఉండనందున అడిగిన ధరకు అమ్ముకోవాల్సి వచ్చేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నేడు అలాంటి పరిస్థితి ఉండకూడదని 1000 కోట్ల రూపాయలతో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక గోదాం చొప్పున మొత్తంగా 21 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములను నిర్మించుకున్నామన్నారు.

పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ఈ గోదాములలో నిల్వ చేసుకుంటే, ఆ పంటపై రుణాన్ని కూడా కల్పించే అవకాశం నేడు రైతుకు ఉందని చెప్పారు. గతంలో వ్యవసాయానికి నీరు వాడితే నీటితీరువా వసూలు చేశారని, రైతుకు తెలంగాణలో ఇక ఈ పరిస్థితి ఉండవద్దని ఆలోచించిన సిఎం కేసిఆర్ 800 కోట్ల రూపాయల నీటి తీరువా బకాయిలను రద్దు చేశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.  బకాయిలు రద్దు చేయడమే కాకుండా నీటి తీరువాలుండవని ప్రకటించిన ఘనత కూడా సిఎం కేసిఆర్ దేనని చెప్పారు. వ్యవసాయం చేసుకునే రైతు రోహిణి కార్తె వచ్చిందంటే పంట పెట్టుబడి కోసం అక్కడా, ఇక్కడా పరుగెత్తి అప్పులు చేయడం చూసిన సిఎం కేసిఆర్, రైతును ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ పథకం కింద ఏటా 12వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రతి పంటకు ఎకరాకు 4వేల రూపాయల చొప్పున ఏడాదికి రెండు పంటలకు ప్రతి ఎకరాకు 8000 రూపాయలను రైతుకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా దేశంలో తెలంగాణ ఒక్కటేనన్నారు. రైతుల భూముల రికార్డులు సరిగా లేకపోవడం వల్ల వారికి రుణాలు రాకుండా, వాటిపై హక్కులు లేకుండా ఇబ్బంది పడుతున్నారని, భూ రికార్డులు ప్రక్షాళన విజయవంతంగా సిఎం కేసిఆర్ చేయించారన్నారు. దీనివల్ల రైతులకు భూమి పట్టాదారు పాస్ పుస్తకాలు అందాయని, సాదా బైనామాలు కూడా క్రమబద్దీకరణ జరిగాయని, భూవివాదాలకు పరిష్కారం లభించిందని తెలిపారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆయన కుటుంబం రోడ్డున పడకూడదన్న గొప్ప ఉద్దేశ్యంతో సిఎం కేసిఆర్ రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. భూరికార్డుల ప్రక్షాళన ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలున్న ప్రతి రైతుకు నేడు రైతు బీమా పథకం వర్తిస్తుందన్నారు. ఎకరం భూమి ఉన్న రైతు నుంచి వంద ఎకరాలున్న రైతుకు కూడా ఒకే రకమైన బీమా ఉంటుందన్నారు. ఒక్కో రైతు కోసం తెలంగాణ ప్రభుత్వం 2271 రూపాయలను ప్రీమియంగా చెల్లించి, 5 లక్షల రూపాయలను బీమాగా అందిస్తుందన్నారు.

ఈ బీమాపథకం కింద నేడు రైతులకు బాండ్లను అందించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో పేదింటి ఆడపిల్లకు పెళ్లి జరిగితే తల్లిదండ్రులకు ఆ పెళ్లి భారం కాకూడదని కళ్యాణలక్ష్మీ కింద మొదట్లో 50వేల రూపాయలను, తర్వాత 75వేల రూపాయలను ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 1, 2018 నుంచి 1,00,116 రూపాయలను అందిస్తోందన్నారు. తెలంగాణలో పేదింటి మహిళ గర్భం దాల్చిన తర్వాత ఆర్ధిక స్తోమత లేకపోవడం వల్ల ప్రసవం వరకు కూడా కూలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని గమనించిన సిఎం కేసిఆర్, తెలంగాణ ఆడపడచులకు అలాంటి బాధ ఉండొద్దని ప్రసవానికి మూడు నెలల ముందు, ప్రసవం తర్వాత కూడా మూడు నెలల పాటు నెలకు 2000 చొప్పున 12వేల రూపాయలు ఇస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. దీంతో పాటు తల్లి, బిడ్డలకు కావల్సిన అన్ని వస్తువులతో కేసిఆర్ కిట్ అందిస్తున్నారన్నారు. ప్రసవానికి ముందు కాల్ చేస్తే ఏసీ వాహనంలో ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లి, బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ అదే ఏసీ వాహనంలో ఇంటి దగ్గర దించుతున్న ఏకైక సంక్షేమ ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. ఇలా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసిఆర్ పాలనను ఈ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. రైతుబీమా పథకానికి ముందు గ్రామంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.