
దేశం లో ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా, రైతుల ప్రస్తావన లేకుండా లేదు. సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఉంటాయి. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎక్కడ వేసిన గొంగడీ అక్కడే ఉంది. ఎనకట పిల్లను ఇవ్వాలంటే ఎంత పొలం ఉంది, ఎన్ని ఎడ్లు ఉన్నాయని అడిగే వారు. ఉద్యోగం చేసేవాళ్లకు పిల్లను ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు పరిస్థితి తారుమారు అయ్యింది. 75 సంవత్సరాల కాలంలో రైతు మీద గౌరవం పోయింది. రైతు ఆత్మహత్య చేసుకొనే దుస్థితిలో ఉన్నాం. కానీ కేసీఆర్ గారి… బంగారు తెలంగాణ సాధ్యం కావాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు బాగుపడితేనే సాధ్యం అవుతుంది అని నమ్మారు. రైతుల బాగు కోరేవారికి ఇది అర్థం అవుతుంది. రాజకీయం చేసేవారికి ఇది అర్థం కాదు. కాంగ్రెస్ హయం లో బ్యాంక్ లకు ఎగకొట్టిన రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది. దాని మొత్తం విలువ3380 కోట్లు మాత్రమే…కానీ తెలంగాణా ప్రభుత్వం మాఫీ చేసింది 17 వేల కోట్లు.
కంటిమీద కునుకు లేదు, కడుపు నిండా నిద్రలేకుండా కరెంటు కోసం రేయింబవళ్లు రైతులు తిరిగారు. కానీ మేము 24 గంటలు కరెంటు ఇస్తున్నాం. నేను ఎమ్ ఎల్ ఏ గా ఉన్న 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం అసెంబ్లీ లో ఎండిపోయిన పంటలతో ఆందోళన చేసినం. సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేసినం. ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ ఇస్తూ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అనే విశ్వాసం రైతుల్లో కల్పించిన ప్రభుత్వం టీఆర్ ఎస్ ప్రభుత్వం. ఆంధ్ర ప్రాంతంలో కాలు అడ్డుపెడితే నీళ్లు ఎలా పారుతున్నాయో అలా తెలంగాణ ను తీర్చి దిద్దుతున్నాం. బోర్లు వేసి బోర్లా పడ్డ తెలంగాణ బ్రతుకు చిత్రం మారుస్తున్నాం. వచ్చే సంవత్సరం జూన్ నుండి పాత కరీంనగర్ జిల్లాలో కరువు ఉండదు. మెడిగడ్డ నుండి నీళ్లను లిఫ్ట్ చేసి ప్రతి చెరువును నింపుతాం.. ప్రతి కాలువకు నీళ్లు ఇస్తాం. కరెంటు, నీళ్లు తరువాత కావాల్సింది పెట్టుబడి. ఈనాడు వ్యవసాయం పైసలు లేనిది ముందుకు పోవడం లేదు. చేసిన వ్యవసాయం వడ్డీలకు సరిపోవడం లేదు అని పెట్టుబడిని కూడా కేసీఆర్ గారు అందిస్తున్నారు.
సంవత్సరనికి 8000 రూపాయలు అందిస్తున్నాం. ఈ డబ్బు పక్క దోవ పట్టకుండా చేయగలిగిన సత్తా మళ్ళీ రైతుకే ఉందని నమ్మి రైతులే కమిటీలు వేసుకొంటే బాగుంటుందన్నారు. పరిగ ఏరుకుంటే కడుపు నిండదని, పంటపండితేనే కడుపునిండుతుందని ఈటెల తెలియజేశారు. ఎరువులు, విత్తనాలు నాణ్యమైనవి అందించడంలో కూడా ఈ కమిటీలు ముఖ్య పాత్ర పోషించబోతున్నాయన్నారు. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి అన్నట్టు ఉంది రైతు పరిస్థితి. పంటకు సరియైన ధర అందించడం అంతిమంగా ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు సమన్వయ కమిటీ ల ద్వారా.. మనం పండించిన పంటకు మనమే ధరను నిర్ణయించుకోబోతున్నామని. పంటను నిల్వ చేసేందుకు పెద్ద ఎత్తున గోదాం లు నిర్మిచామన్నారు.
500 కోట్ల రూపాయలు బడ్జెట్ ద్వారా రైతు సమన్వయ కమిటీలకు అందించబోతున్నాం. మరో 6000 కోట్లు బ్యాంక్స్ ద్వారా సమన్వయ కమీటలకు అందించి ధరల స్థిరీకరణ చేయబోతున్నాం. ఏ ఒక్క రైతు కూడా నష్టానికి పంటను అమ్ముకోకూడదు. రైతు కి లాభం జరగాల్సిందే. సమన్వయ కమిటీ సభ్యత్వం అంటే ఇది పదవి కాదు, బాధ్యత. అన్ని కులాలకు రైతుకు కులం, మతం తో సంబంధం లేదు. రైతు కు ఉంది మట్టితో సంబంధం. అందరి భాగస్వామ్యం కోసమే అన్ని వర్గాలవారికి అవకాశం. రైతుగా నేను బ్రతకాలి, నా పక్క రైతు కూడా బ్రతకాలి అని పనిచేయండి. బంగారు తెలంగాణ పట్నం లో లేదు, పల్లెల్లో ఉంది, పంట పొలాల్లో ఉంది. కొత్తవాళ్ళమే, చిన్న వాళ్ళమే కావొచ్చు కానీ విశ్వాసం కల్పించినం. పక్క రాష్ట్రాల వారుకుడా వచ్చి మన అభివృద్ధిని చూసి పోతున్నారు. అందరికి అన్ని రావు, ఇప్పుడు అవకాశం వచ్చిన వారికి సహకరించండి. రైతుకి అండగా ఉండండి అంటూ వరంగల్ అర్బన్ జిల్లా
కమలపూర్ లో రైతు సమన్వయ కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించిన సందర్భంగా మంత్రి ఈటల అన్నారు.