రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ఓ మంచి అవకాశం.

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన మంచి అవకాశం.

వంద శాతం అటవీ భూములను కాపాడాలి అనేది సీ.ఎం ఆదేశం.

సర్వే సందర్భంగా ప్రతీ అటవీ బ్లాక్ భూములకు హద్దులు నిర్ణయించాలి

రికార్డుల్లో తప్పులుంటే సరిదిద్ది, అటవీ భూములను నమోదు చేయాలి

వచ్చే యేడాది హరితహారం కోసం నర్సిరీల్లో మొక్కల పెంపకం ప్రారంభించాలి

అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ఎవెన్యూ ప్లాంటేషన్ లు అటవీ శాఖకు ప్రతిష్టాత్మకం

అన్ని స్థాయిల ఉద్యోగులతో విడియో కాన్ఫరెన్స్ సందర్భంగా అటవీ శాఖ ఉన్నతాధికారులు.

 

నెల పదిహేను నుంచి మొదలయ్యే రెెవెన్యూ రికార్డుల ప్రక్షాళలను అటవీ భూముల రక్షణకు, హద్దుల గుర్తింపుకు వాడుకోవాలని, వంద శాతం అటవీ భూములను గుర్తించటంతో పాటు వాటిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసేలా పనిచేయాలని క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి అటవీ శాఖ ఉన్నతాధికారులు సూచించారు. సచివాలయం నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాలకు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి, సర్కిల్ హెడ్ వరకు, అలాగే అటవీశాఖ ప్రధాన కార్యాలయం నుంచి అందరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అటవీ భూముల రక్షణ, సరిహద్దుల ఏర్పాటు, హరితహారం పురోగతి, వచ్చే యేడాదికి నర్సిరీల్లో ఏర్పాట్లు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్, నెల 11 జరిగే అటవీ అమర వీరుల దినోత్సవం ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు.  

 సర్వే సందర్భంగా రెవెన్యూ శాఖ తో సమన్వయం ద్వారా ప్రతీ ఫారెస్ట్ బ్లాక్ లో అటవీ భూములను గుర్తించటంతో పాటు, వివాద రహితంగా ఉన్న ప్రాంతాలను, వివాదాల్లో ఉన్న భూములను విడివిడిగా నమోదు చేయాలని ఆదేశించారు. ఒక వేళ అటవీ భూమి వివాదాల్లో ఉంటే, అది రకమైన వివాదమో కూడా నమోదు చేయాలన్నారు.  ప్రతీ అటవీ భూమిని తహసిల్దార్ వద్ద ఉండే POBలో 

( ప్రొహిబిటరీ  ఆర్డర్ బుక్ ) ఎంట్రీ చేయించాలని, తద్వారా వాటి రక్షణ మరింత సులువు అవుతుందని చెప్పారు. అలాగే నమోదు సమయంలోనే సంబంధిత భూమి స్థితిలో ఉందో, రిజర్వ్ ఫారెస్ట్, అటవీ పోరంబోకు లాంటి వివరాలు కూడా రికార్డు చేయించాలని ఆదేశించారు. ROFR చట్టం కింద గిరిజనులకు అటవీ భూముల్లో హక్కులు కల్పిస్తే, వివరాలను కూడా అటవీ బ్లాక్ లో , ఎంత మంది గిరిజనులకు, ఎన్ని ఎకరాల్లో హక్కులు ఇచ్చిన వివరాలు కూడా నమోదు చేయాలని సూచించారు. అటవీ భూముల రక్షణ ద్వారా తెలంగాణలో పర్యావరణ సమతుల్యత సాధించాలనేది ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, అటవీ శాఖ మంత్రి జోగు రామన్నల లక్ష్యమని, దాని సాధన కోసం ప్రతీ అధికారి, సిబ్బంది పనిచేయాలన్నారు

ఇక హరితహారం కొనసాగుతున్నతీరుపై ఉన్నతాధికారులు జిల్లాల వారీగా  సమీక్షించారు. ప్రస్తుత ఏడాదిలో నాటిన మొక్కల రక్షణ కొనసాగిస్తూనే, వచ్చే ఏడాది కోసం నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని మొదలు పెట్టాలని సూచించారు. ప్రతీ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమన్వయ కమిటీల సమావేశంలో వచ్చే ఏడాది నాటాల్సిన మొక్కల లక్ష్యం, శాఖల వారీగా టార్గెట్లను నిర్దేశించాలని కోరారు. ఇప్పటి నుంచే మొక్కలను పెంచటం వల్ల, వచ్చే సీజన్ లో నాటే సమయానికి మొక్కలు తగిన సైజ్ లో ఉండి, రక్షణ  సులువు అవుతుందని తెలిపారు. ఒక్కో అటవీ డివిజన్ కు ఒక లక్ష చొప్పున పెద్ద మొక్కలను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు

పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన ప్రకృతిని అందుబాటులో తెచ్చే లక్ష్యంతో అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు జరుగుతోందని, ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో 26 పార్కులను అభివృద్ది చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిని పూర్తి స్థాయి సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చాక మరిన్ని పార్కులను అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు. ఇక జిల్లాలకు వంద కిలో మీటర్ల చొప్పున యేడాది ఎవెన్యూ ప్లాంటేషన్ ను లక్ష్యంగా నిర్దేశించుకొన్నట్లు, ఇప్పటికే సుమారు 800 కిలో మీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి అయిందని అధికారులు తెలిపారు. వచ్చే మార్చి లోపు అన్ని జిల్లాల్లో టార్గెట్ ను పూర్తి చేయాలని కోరారు

నెల 11 రాష్ట్ర వ్యాప్తంగా అటవీ అమరవీరుల దినోత్సవం జరుగుతుందని, అటవీ, వన్య ప్రాణి సంపదను కాపాడేందుకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బందికి ఘనంగా నివాళులు అర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ లో జరిగే ప్రధాన కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చ జరిగింది

వీడియో కాన్పరెన్స్ లో ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పి.కె. ఝా, అదనపు అటవీ సంరక్షణ అధికారులు, అన్ని జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

 

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *