
ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావుకు ఎవరైనా వాస్తవాలు వివరిస్తే బాగుండేది. తెలంగాణ మీద ఆయన పెత్తనం చెల్లదని తత్వం బోధపడితే బుద్ధిగా పనిచేస్తారేమో. రాష్ట్రం విడిపోయి ఎనిమిది నెలలు దాటింది. విభజన చట్టం ప్రకారం ఎంసెట్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికే అధికారం ఉంది. ఈ రెండు విషయాలూ గంటాకు ఇంత వరకూ బోధపడ లేదేమో అనిపిస్తుంది. కామన్ గా పరీక్ష పెట్టాలనుకున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని దబాయించే ధోరణిలో మాట్లాడ కూడదు. సామరస్యంగా ఒప్పించాలి. దీనిపై అనేక సార్లు చర్చలు జరిగాయి.
ఇటీవల హటాత్తుగా ఎంట్రెన్స్ పరీక్షల తేదీలను ఏపీ ప్రభుత్వం ఎడా పెడా ప్రకటించింది. అంటే ఏమిటి అర్థం? ఆ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం చేతులు కట్టుకుని గుడ్డిగా ఫాలో కావాలనా? లేక ఎవరికి వారు విడిగా పరీక్షలు జరపాలనా? ఈ విషయంలో ఏపీ పాలకులకే స్పష్టత లేనట్టుంది. ఏక పక్షంగా తేదీలు ప్రకటించిన వారు ఉమ్మడిగా పరీక్షలంటూ పాత పాటే పాడుతున్నారు. అలాంటప్పుడు షెడ్యూలును విడుదల చేయడం ఏమిటి? మొదటి నుంచి ఆంధ్రుల రుబాబు, దబాయింపు భరించ లేం అనేదే తెలంగాణ ఉద్యమంలో కీలకాంశాల్లో ఒకటి.
రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రుబాబేనా, దబాయింపేనా? తాజాగా రెండు రాష్ట్రాల విద్యా మంత్రులతో గవర్నర్ చర్చించారు. సామరస్యంగా, విద్యార్థులకు నష్టం కలగని విధంగా పరీక్షలు జరపాలని సూచించారు. హైదరాబాదుతో సహా తెలంగాణ మీద తమ పెత్తనం గానీ రుబాబు గానీ, దబాయింపు గానీ నడవవు అని గంటా గారు గుర్తించక పోతే, తెలంగాణ ప్రభుత్వం వేరుబాటకు నిర్ణయిస్తే, ఆంధ్ర విద్యార్థులకు కష్ట నష్టాలు తప్పవేమో. కనీసం చంద్రబాబు నాయుడైనా కళ్లు తెరిచి తత్వం గ్రహిస్తే మంచిది. తెలంగాణకు ఒక ప్రభుత్వం ఉంది, అది చంద్రబాబు కేబినెట్ కింద పనిచేసేది కాదు అనే వాస్తవాన్ని ఆంధ్ర సీఎం, మంత్రులు గ్రహించడం మంచిది.