రిమ్స్ కు అదనంగా గైనిక్ యూనిట్లు

మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ భవనాలు, కొత్త పోస్టులు
ఆరోగ్యశ్రీకి సేవలు మరింత వేగవంతం
పాలక మండలి సమావేశంలో నిర్ణయం

రిమ్స్ కు అదనంగా గైనిక్ యూనిట్లు ఇవ్వాలని, అలాగే అక్కడ జరుగుతున్న వైద్య సేవల దృష్ట్యా నిరంతరాయంగా విద్యుత్ అందే విధంగా ఒక ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రిమ్స్ పాలకమండలి. అలాగే మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో భవన నిర్మాణాలను వేగవంతం చేయడంతోపాటు, గైనిక్ యూనిట్‌ని ఇవ్వాలని, ఎంసిఐ నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తర్వాత ఏడాదికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. ఇక ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం, వేగవంతం చేయాలని నిర్ణయించింది.ఈ మూడు పాలక మండళ్ళ సమావేశాలు వేర్వేరుగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆరోగ్య శ్రీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జరిగాయి.

ఈ సందర్భంగా ఈ మూడు సమావేశాలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి నేతృత్వం వహించారు. రిమ్స్ సమావేశానికి బీసీ సంక్షేమ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకూడా హాజరయ్యారు. కాగా, రిమ్స్ పని తీరు మీద సమర్పించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ని మంత్రులు పరిశీలించారు. రిమ్స్‌లో మంచి సేవలు అందుతున్నాయని రిమ్స్ డాక్టర్లు, సిబ్బందిని అభినందించారు. రిమ్స్‌లో ప్రసవాలు కూడా బాగా జరుగుతున్నందున ప్రోత్సాహకంగా ఉండే విధంగా మరో గైనిక్ యూనిట్‌ని ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే అక్కడ నిరంతరాయంగా విద్యుత్ ఉండే విధంగా ఒక ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు.

మరోవైపు మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో భవన నిర్మాణాల మీద సమీక్ష జరిగింది. అక్కడ నిర్మాణాలు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి లక్ష్మారెడ్డి. అలాగే వచ్చే ఏడాదికి ఎంసిఐ నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న టీచింగ్ స్టాఫ్‌కి ప్రమోషన్లు, కొత్త నియామకాలపై చర్చ జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి స్త్రీ సంబంధ, ప్రసవాల రెఫరల్స్ ఎక్కువగా సిటీ కి వస్తున్నాయని, వాటిని తగ్గించడానికి వీలుగా అక్కడ ఓ గైనిక్ యూనిట్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో కొన్ని కేసులు అక్కడే పరిష్కారమయ్యే వీలుంటుందని భావించారు.

ఇక ఆరోగ్యశ్రీ సేవలు మరింత వేగవంతం, సమర్థవంతం కావాలని భావించింది పాలకమండలి. ఇప్పటి వరకు అందిస్తున్న సేవలు, అవుతున్న వ్యయంపై సమీక్ష జరిగింది. ఉద్యోగుల హెల్త్ స్కీం, జర్నలిస్టుల హెల్త్ స్కీంల మీద కూడా సమీక్ష జరిగింది. ప్రతి పాత జిల్లా కేంద్రంలో ఒక వెల్ నెస్ సెంటర్ పెట్టాలని నిర్ణయించగా, సాధ్యమైనంత వేగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ లలో వెల్ నెస్ సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం వెల్ నెస్ సెంటర్లు బాగా నడుస్తున్నందున మంచి స్పందన వస్తుందన్నారు. వెల్నెస్ స్కీంని పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించారు. మరిన్ని సేవలను విస్తృత పరుస్తూ, అభివృద్ధి పరచాలని కూడా భావించారు.

ఈ పాలక మండళ్ళ సమీక్ష సమావేశాల్లో మంత్రి లక్ష్మారెడ్డితోపాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డిఎంఇ రమణి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, రిమ్స్ డైరెక్టర్ అశోక్, ఆరోగ్య శ్రీ సిఇఓ డాక్టర్ చంద్రశేఖర్, ఉద్యోగ, జర్నలిస్టుల హెల్త్ స్కీం సిఇఓ డాక్టర్ పద్మ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.