రాష్ట్ర ఉపాధి హామీకౌన్సిల్స‌మావేశంలో వైస్ చైర్మ‌న్‌, మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

ఉపాధి ప‌నుల్లో వేగం పెంచాలి

స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులను పూర్తి స్థాయిలో భాగ‌స్వామ్యం చేయాలి

ఉపాధి హామీ కౌన్సిల్ స‌భ్యుల‌ను జిల్లా స్థాయి స‌మావేశాల్లో భాగస్వామ్యం చేయాలి

క‌నీసం 60 శాతం మంది జాబ్‌కార్డులున్న కూలీల‌కు 100రోజులు ప‌ని క‌ల్పించాల్సిందే

కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఉపాధి ప‌నుల అవ‌క‌త‌వ‌క‌ల‌పై కౌన్సిల్ స‌భ్యుల ఫిర్యాదు

వారం రోజుల్లో నివేధిక ఇవ్వాల‌ని క‌మిష‌న‌ర్‌ను ఆదేశించిన మంత్రి జూప‌ల్లి

హైద‌రాబాద్‌-గ‌తంతో పోల్చితే ఉపాధి ప‌నులు పెద్ద ఎత్తున జ‌రుగుతున్నాయ‌ని…అయితే ఇంకా వేగం పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అభిప్రాయ‌ప‌డ్డారు. రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని తెలంగాణా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ‌లో శ‌నివారం ఉపాధి హామీ కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ… స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులను పూర్తి స్థాయిలో భాగ‌స్వామ్యం చేస్తేనే అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోగ‌ల‌మ‌న్నారు. జాబ్ కార్డులున్న‌కూలీల్లో క‌నీసం 60 శాతం మందికి 100 రోజుల ప‌నిదినాల‌ను క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. హ‌రిత‌హారం, వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల నిర్మాణం లాంటి కార్య‌క్ర‌మాల‌ను పెద్ద ఎత్తున చేప‌డితే ఈ లక్ష్యాన్ని చేరుకోవ‌డం అసాధ్యం కాద‌న్నారు. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో కేంద్రం మంజూరు చేసిన ఉపాధి నిధుల‌ను పూర్తి స్థాయిలో వాడుకోగ‌లిగామ‌న్నారు. కొన్ని గ్రామాల్లో 90 శాతం మంది కూలీల‌కు ప‌ని క‌ల్పిస్తే… మ‌రికొన్ని గ్రామాల్లో మాత్రం అతి త‌క్కువ మందికి ప‌నులు క‌ల్పిస్తున్నారన్నారు. ఇందులో త‌ప్పు ఎక్కడ జ‌రుగుతుంది…బాధ్యులెవ‌రో గుర్తించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఏ కార్య‌క్ర‌మం అయినా స‌మిష్టి కృషి , అంద‌రి భాగ‌స్వామ్యం ఉంటేనే విజ‌య‌వంతం అవుతుంద‌ని… ఉపాధి ప‌నుల్లోనూ క్షేత్ర‌స్థాయి ప్ర‌జాప్ర‌తినిధుల‌ను, ప్ర‌జ‌ల‌ను పూర్తిస్థాయిలో క‌లుపుకుని పోయేలా కార్య‌క్ర‌మాలు రూప‌క‌ల్ప‌న చేయాల‌న్నారు. అక్టోబ‌ర్ 2నాటికి స్వ‌చ్ఛ తెలంగాణా ల‌క్ష్యంగా ముందుకు పోతున్నామ‌ని…ఆ దిశ‌గా గ్రామాల్లో మ‌రుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మాల్లో ఉపాధి హామీ కౌన్సిల్ స‌భ్యుల‌ను కూడా పూర్తి స్థాయిలో భాగ‌స్వామ్యం చేయాల‌ని… జిల్లా స్థాయి స‌మావేశాల‌కు వారిని ఆహ్వానించాల‌ని మంత్రి సూచించారు. కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఉపాధి ప‌నుల అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఆయా జిల్లాల స‌భ్యులు కౌన్సిల్ స‌మావేశంలో ప్ర‌స్తావించారు. దీనిపై మంత్రి జూప‌ల్లి త‌క్ష‌ణ‌మే స్పందించి..వారం రోజుల్లో నివేధిక ఇవ్వాల‌ని, బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌మిష‌న‌ర్‌ను ఆదేశించారు. గ‌తంతో పొలిస్తే పెద్ద ఎత్తున సీసీ రోడ్ల‌ను ఉపాధి ప‌నుల్లో భాగంగా మంజూరు చేయ‌డంపై మంత్రి జూప‌ల్లికి కౌన్సిల్ స‌భ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.త‌మ‌కు గౌర‌వ వేత‌నాన్ని ఇవ్వాల‌ని కౌన్సిల్ స‌భ్యులు మంత్రికి విజ్ఞాప‌న ప‌త్రం అంద‌జేశారు. స‌మావేశంలో ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, క‌మిష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్‌, క్రిస్టినా జడ్ చోంగ్తు త‌దిత‌రులు పాల్గొన్నారు.

jupally krishna rao 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *