
నవంబర్ నెల నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు దశల వారీగా నీళ్లు అందిస్తామన్నారు మిషన్ భగీరథ వైస్ ఛైర్మెన్ వేముల ప్రశాంత్ రెడ్డి. ఇందుకు అవసరమైన పంపులు, మోటార్లు త్వరలోనే వస్తున్నాయని,వాటిని బిగించేందుకు అవసరమైన అన్ని పనులు పూర్తి చేయాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై RWS&S కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్లు, అన్ని జిల్లాల ఎస్.ఈలతో సమీక్ష సమావేశం నిర్వహించిన వేముల ప్రశాంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిపై నివేదికలు తయారుచేయాలన్నారు. ఇంటెక్ వెల్స్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్, పైప్ లైన్ పనుల వివరాలతో సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. ఇంతేకాదు ఒక నియోజకవర్గానికి ఏ ఇంటెక్ వెల్ నుంచి నీరు వస్తుంది? ఏ ట్రీట్ మెంట్ ప్లాంట్ నుంచి ఏయే గ్రామాలకు శుద్ది చేసిన నీరు పోతుంది? ఈ వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలన్నారు. రాబోయే రెండు నెలల మిషన్ భగీరథకు కీలక సమయమని, ప్రతీ ఒక్క ఇంజనీర్ కష్టపడి ఫలితాన్ని సాధించాలన్నారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్లు కృపాకర్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, విజయ్ ప్రకాశ్,OSD సత్యపాల్ రెడ్డి తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.