
ఆదరణ కరువైన సందర్శక ప్రాంతాలను ప్రాచుర్యంలో కి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ లతో కలిసి ఆదివారం నాడు సైదాపూర్ మండలం రాయికల్ గ్రామ శివారులో గల జలపాతాన్ని సందర్శించారు. గ్రామ శివారు నుండి కాలినడకన మూడుకిలో మీటర్ల దూరం వరకు కాలినడకన వెళ్ళి జలపాతం కింది భాగం నుండి రెండున్నర గంటల పాటు
ట్రెక్కింగ్ నిర్వహించారు. సహజ సిద్దమైన ప్రకృతి అందాలు, ఆహ్లదకరమైన వాతావరణంలో జరిగిన ఈ ట్రెక్కింగ్ లో స్ధానికులు, ప్రజాప్రతినిధులు, ఫ్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పోలీసు అధికారులు హుషారుగా పాల్గొన్నారు. కరీంనగర్ నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఈ రాయికల్ జలపాతం ఉంటుంది. ప్రాచుర్యంలోకి రాకపోవడం వల్ల స్ధానికులు చుట్టుపక్క గ్రామాలకు చెందిన ప్రజలు మినహ ఎవరూ ఈ ప్రాంతాన్ని సందర్శించలేకపోతున్నారు. ప్రాచీన కట్టడాలు, చారిత్రాత్మక , సందర్శక ప్రాంతాలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి గతనెలలో మొలంగూరు ఖిల్లాలో ట్రెక్కింగ్ నిర్వహించిన విషయం విదితమే. నిజాం కాలంలో
గ్రామంలో కొనసాగిన పోలీస్ స్టేషన్ భవనాన్ని కమీషనర్, జిల్లా కలెక్టర్లు పరిశీలించారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటైన కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ ఆదరణ కరువైన ఈ జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ ట్రెక్కింగ్ ను నిర్వహించామన్నారు. జలపాతానికి వెళ్ళే మార్గంలో ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు బ్లూకో్ల్ట్స్ బృందాలతో గస్తీ నిర్వహిస్తామని చెప్పారు. అసాంఘీక, అక్రమ కార్యకలాపాల నియంత్రణ కోసం పోలీసులు చేపడుతున్న చర్యల్లో ప్రజలు భాగస్వామలు కావాలని కోరారు. పాశ్చాత్య సంస్కృతి, కొన్ని రకాల ఆకర్షణలతో శంకరపట్పం, సైదాపూర్ ప్రాంతాల్లో అనేక యువ జంటలు లేచిపోతున్నాయని, వయస్సురీత్యా వచ్చే ఆలోచనలు అదుపులో ఉంచుకుని ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేసేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ రాయికల్ గ్రామం నుండి జలపాతం వరకు రోడ్డు నిర్మాణం కోసం అటవీ, పర్యాటక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎసిపి యం రవీందర్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వరరావు, ఇన్స్ పెక్టర్లు రవీందర్ రెడ్డి, రమణమూర్తి, నారాయణ, మహేష్ గౌడ్, విజయ్ కుమార్, శశిధర్ రెడ్డి, సిహెచ్ రమేష్, ఆర్ఐ గంగాధర్, జడ్పీటిసి వెంకటరెడ్డి, సర్పంచ్ జేరిపోతుల పద్మ, పలువురుపోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాయికల్ పోలీస్ అవుట్ పోస్ట్
జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు రక్షణ, అసాంఘీక కార్యకలాపాల నియంత్రణకు రాయికల్ గ్రామంలో పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని పోలీస్ కమీషనర్ విబి కమబలాసన్ రెడ్డి అన్నారు. అవుట్ పోస్టు ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించనున్నామని పేర్కొన్నారు. నిజాంకాలంలో కొనసాగిన పోలీస్ స్టేషన్ భవనానికి మరమ్మతులు చేసి అదే భవనంలో అవుట్ పోస్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు.