
డిప్యూటీ సిఎం ‘‘ ఫాదర్ ఆఫ్ డాటర్స్’’
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి గవర్నర్ సతీమణి విమలా నరసింహ్మన్ కితాబు
హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పథకం చాలా మంచిది
తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు ఈ పథకం
ఈ పథకం రూపకల్పనలో ఉప ముఖ్యమంత్రి చాలా శ్రద్ధ పెట్టారు
పరిశుభ్రతే దైవం…పాఠశాలను, తరగతిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
విద్యార్థినిలు జంక్ ఫుడ్ తినొద్దు..చిరుధాన్యాలు, తృణధాన్యాలు తింటే మంచిది
గవర్నర్ సతీమణి విమలా నరసింహ్మన్ చేతులుమీదుగా రాజ్ భవన్ స్కూల్ లో హైల్త్ అండ్ హైజీన్ కిట్స్ పంపిణీ
12 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలకు ఈ నెల 13 నుంచి 20వరకు అన్ని పాఠశాలల్లో, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పంపిణీ
ఆరు లక్షల మంది ఆడపిల్లలకు 12 మాసాలకు సరిపోయే విధంగా కిట్స్ పంపిణీ
ఒక్కో విద్యార్థినికి 1600 చొప్పున ఏటా వంద కోట్ల రూపాయలు ఖర్చు
సిఎం కేసిఆర్ ఆదేశాల మేరకు పోషకవిలువలతో కూడిన ఆహారం, ఆరోగ్య సంరక్షణ చర్యలు
రాజ్ భవన్ హైస్కూల్ లో గవర్నర్ సతీమణి ఈ పథకంపై సంతృప్తి వ్యక్తం చేశారు
గత నాలుగేళ్లలో 570 గురుకుల పాఠశాలలు, 53 ఉమెన్ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు
ప్రభుత్వ విద్యావ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం
గవర్నర్ చొరవ వల్లే రాజ్ భవన్ పాఠశాలకు గుర్తింపు వచ్చింది
ఈ పాఠశాలను గవర్నర్ గారు దత్తత తీసుకొని పట్టించుకుని అభివృద్ధి చేస్తున్నారు
గవర్నర్ గారి చొరవ వల్లే ఒకేరోజు ఉపాధ్యాయులందరినీ ఇక్కడ నియామకం చేయాల్సి వచ్చింది
రాజ్ భవన్ ఉన్నత పాఠశాలలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో విద్యారంగాన్ని పటిష్టం చేయడానికి అనేక పథకాలు అమలు చేస్తున్నాం, అందులో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆడపిల్లలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇచ్చే పథకం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన పథకమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బాలికల పట్ల తల్లిదండ్రులు తీసుకునే సంరక్షణ ఈ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ద్వారా ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. నేడు రాజ్ భవన్ స్కూల్ లో బాలికలకు గవర్నర్ సతీమణి విమలా నరసింహ్మన్ చేతుల మీదుగా హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పంపిణీ చేశారు. తెలంగాణలో ఎక్కువశాతం మంది పేదవర్గాలకు చెందిన వాళ్లే ఉన్నారని, వారి పిల్లలకు ఉచిత విద్య అందించడమే కాకుండా నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో సిఎం కేసిఆర్ విద్యారంగంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. గత నాలుగేళ్లలో 570 గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లలకు 53 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ఒక్కటేనని అన్నారు. పేదవర్గాల నుంచి వచ్చిన ఆడపిల్లల్లో రక్తహీనత ఉందని గుర్తించిన ప్రభుత్వం వారికి నేడు పోషకాలతో కూడిన ఆహారం అందించే మెనును రూపొందించి అమలు చేస్తోందన్నారు. ఈ మెనులో నెలకు నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్, వారానికి నాలుగు రోజులు గుడ్లు, ప్రతిరోజు ఉదయం బూస్ట్ మిల్క్, రాగి మాల్ట్, మధ్యాహ్న భోజనంలో ప్రతి రోజు 50 గ్రాముల నెయ్యి, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ అందిస్తున్నామన్నారు. పోషకాహారంతో పాటు వారి ఆరోగ్య సంరక్షణ కూడా ముఖ్యమైందని భావించి హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తున్నామని చెప్పారు. ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్, ప్రభుత్వ, మోడల్ స్కూల్స్, గురుకుల, కేజీబీవీ, పంచాయతీరాజ్ పాఠశాలలన్నింటిలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థినిలకు ఈ కిట్స్ అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ కిట్స్ లలో ఆడపిల్లలకు కావల్సిన అన్ని వస్తువులున్నాయన్నారు. 12 నెలలకు సరిపడే విధంగా ఏడాదికి నాలుగుసార్లు ఈ కిట్స్ అందిస్తామన్నారు. ఒక్కో విద్యార్థిపై ఈ కిట్స్ ద్వారా ఏటా 1600 ఖర్చు చేస్తున్నామని, ఆరు లక్షల మందికి ఏటా 100 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు వివరించారు.
ఈ పథకాన్ని నేడు గవర్నర్ సతీమణి విమలా నరసింహ్మన్ చేతులు మీదుగా రాజ్ భవన్ స్కూల్ లో ప్రారంభించడం సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రాజ్ భవన్ స్కూల్ ను గవర్నర్ నరసింహ్మన్ గారు దత్తత తీసుకుని దీనిని బాగా పట్టించుకుంటున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో ఇక్కడి టీచర్లంతా బదిలీ అయితే వెంటనే తన స్కూల్ లో టీచర్లు లేరని గవర్నర్ గారు తనకు కాల్ చేసి చెప్పారని, ఆయన చెప్పడంతో అదే రోజు మొత్తం టీచర్లను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. ఆడపిల్లల కోసం అమలు చేస్తున్న హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడా అమలు కావడం లేదని, ఇది చాలా మంచి పథకమని గవర్నర్ సతీమణి విమలా నరసింహ్మన్ కొనియడారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆడపిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారని, అందుకే ఆయన ‘‘ ఫాధర్ ఆఫ్ డాటర్స్ ’’ అని ప్రశంసించారు. హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ తీసుకురావడంలో ఉప ముఖ్యమంత్రి చాలా కృషి చేశారన్నారు. పరిశుభ్రతే దైవమని, విద్యార్థులు తమ పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థినిలు జంక్ ఫుడ్ తినవద్దని, చిరుధాన్యాలు,తృణధాన్యాలు తినాలన్నారు. అదేవిధంగా ఇళ్లలో అల్యుమినీయం కడాయిలు పూర్తిగా తొలగించి, ఇనుప కడాయిలే వాడాలన్నారు. ఇనుప కడాయిలు వాడడం వల్ల ఎంతో కొంత ఐరన్ విటమిన్ శరీరానికి అందుతుందని, ఇది డాక్టర్లు చెప్పారని తెలిపారు. ఇప్పటికీ తను ఇనుప కడాయిలే వాడుతున్నట్లు చెప్పారు.