
భూసేకరణ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోద ముద్ర పడింది. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్న ఈ సభలో మిత్ర పక్షాలతో కలిసి బిల్లును నెగ్గించుకోవడం లాంఛనమే. అయితే, ఒక మిత్రపక్షం శివసేన మాత్రం అనుకూలంగా ఓటు వేయడానికి ఒప్పుకోకపోవడం, ఓటింగుకు గైర్హాజరు కావడం బీజేపీకి చికాకు కలిగించే విషయం. బీజేడీ, టీఆరెస్ వాకౌట్ చేయడం విశేషం.
బీజేపీకి బలం లేని రాజ్యసభలో బిల్లు నెగ్గడం అసాధ్యంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలను మెప్పించడానికి 9 సవరణలను ఒప్పుకున్నా, మరో రెండు సవరణలకు సరే అన్నా… రాజ్యసభలో బిల్లు నెగ్గితే అద్భుతమే. ఒక మిత్రపక్షమే సమ్మతంగా లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా నెగ్గుకొస్తుందనేది ఆసక్తికరం.
ఒకవేళ రాజ్యసభలో బిల్లు ఓడిపోతే చట్టం తీసుకురావడం కుదరదు. అయితే రాజ్యాంగం ఇచ్చిన విశేషాధికారాన్ని ఉపయోగించి, పార్లమెంట్ సంయుక్త సమావేశాలను ఏర్పాటు చేసి ఓటింగ్ జరపవచ్చు. అప్పుడు బిల్లు సునాయాసంగా నెగ్గుతుంది. శివసేన వ్యతిరేకంగా ఓటు వేసినా ఏ ఇబ్బందీ ఉండదు. ఎందుకంటే లోక్ సభలో ఎన్డీయేకు అతి భారీ సంఖ్యాబలం ఉంది.
గతంలో వాజ్ పేయి ప్రభుత్వం ఈ అసాధారణ అధికారాన్ని ఉపయోగించి ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని తెచ్చింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అదే విధంగా చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా బిల్లు నెగ్గితేనే సంస్కరణల అనుకూల ప్రభుత్వంగా ఇమేజి పెరుగుతుందని, విదేశీ పెట్టుబడులు వస్తాయని కేంద్రం భావిస్తోంది.