
తెలంగాణ శాసనమండలి ఎన్నికలు వేడెక్కాయి.. ఎన్నికలకు రోజులు దగ్గర పడడంతో ఎన్నికల వేడి రాజుకుంది. స్వయంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగారు. తెలంగాణ భవన్ లో తెరాస శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యారు. మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు దిశానిర్ధేశం చేశారు.
బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్ .. బీజేపికి ఓటేస్తే మోరీలో వేసినట్లేనని వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్ర సమస్యలపై స్పందించడం లేదని.. తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రలో కలిపేశారని..హైకోర్టును విభజించడం లేదని.. తెలంగాణకు ఆంధ్ర కరెంటు ఇవ్వకపోయినా ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ సమస్యలకు బీజేపీ టీడీయే కారణమని ఆరోపించారు.
కాగా మండలి ఎన్నికల్లో వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు సునాయసమైనా.. హైదరాబాద్-రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి మాత్రం గెలుపుపై ప్రచారం లేదని.. ఇక్కడ అభ్యర్థి గెలుపుపై సందేహాలున్నాయని కేసీఆర్ పార్టీ నేతలతో వ్యాఖ్యానించారని సమాచారం. ఇక్కడ గెలుపు బాధ్యతను సీఎం పార్టీ స్ట్రగుల్ కింగ్ హరీష్ రావుకు అప్పగించారు. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ఎన్నికల బరిలోకి దిగడం తో వేడి రాజుకుంది.