రాజీవ్ స్వగృహ’  ప్లాట్ల వేలానికి రంగం సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం

 

ఆన్ లైన్ లో ఓపెన్ బుకింగ్ ద్వారా ఫ్లాట్ల అమ్మ‌కం

ఆగ‌స్టు చివ‌రి వారం నుంచి  ఆన్ లైన్ లో ప్లాట్ల విక్ర‌యం.

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులకు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం.

త్వ‌ర‌లోనే వెబ్ సైట్ లాంచ్  : మ‌ంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హైదరాబాద్: రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్లాట్ల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు   అమ్మేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఆన్ లైన్ ద్వారా ఫ్లాట్లను విక్రయించ‌నున్నారు. మొద‌టి ద‌శ‌లో బండ్లగూడ, పోచారం లో నిర్మించిన 3,719 ఫ్లాట్లను విక్ర‌యించ‌నున్నారు. పార‌ద‌ర్శ‌కంగా ఇండ్ల‌ను విక్ర‌యించేందుకు రాజీవ్  స్వగృహ కార్పోరేష‌న్ త‌ర‌పున  ఆన్ లైన్ ప్రక్రియ కోసం త్వ‌ర‌లోనే వైబ్ సైట్ ను ప్రారంభించనున్న‌ట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దీని కోసం సెంట్ర‌ల్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ప్ర‌త్యేక ఆప్లికేష‌న్ ను అభివృద్ది చేసింది.

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కోట్ల విలువైన‌ ఫ్లాట్లు నిరుప‌యోగంగా ప‌డి ఉన్నాయన్నారు.  స‌రియైన విధంగా మార్కెట్ ను అంచ‌నా వేయ‌కుండా గుడ్డిగా గ‌త ప్ర‌భుత్వాలు భారీ ఖ‌ర్చుతో ఈ ప్రాజెక్ట్ ను చేప‌ట్ట‌య‌న్నారు. దీంతో నిర్మాణాలు పూర్తైనా..  ప్లాట్లు విక్ర‌యం కాలేద‌న్నారు. దీనికి తోడు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి వడ్డీ కూడా గ‌త ప్ర‌భుత్వాలు స‌రిగా చెల్లించ‌క‌పోవ‌డంతో ఆ భారం తెలంగాణ రాజీవ్ స్వ‌గృహ మీద ప‌డింద‌న్నారు.  రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత  తెలంగాణ వాటాగా వ‌డ్డీతో క‌లిపి రూ. 1069 కోట్ల రూపాయలు  రాజీవ్ స్వ‌గృహపై భారం ప‌డిందని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు రాజీవ్ స్వ‌గృహ‌పై ఉన్న అప్పులను తీర్చేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రూ.820 కోట్ల రుణాన్ని తీర్చిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే మిగిలిన రూ.256 కోట్ల అప్పును తీర్చేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.

రాజీవ్ స్వ‌గృహ కార్పోరేష‌న్  అన్ని మౌలిక వ‌స‌తుల‌తో కూడిన ఫ్లాట్లను నిర్మించింద‌ని, వీటిని కొనుగోలు చేయాల‌నుకునే ప్ర‌భుత్వ ఉద్యోగులు ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవాల‌ని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి కోరారు. గృహ ప్రవేశాల‌కు సిద్ధంగా ఉన్న ఫ్లాట్లతో పాటు చిన్న చిన్న ప‌నులు మిగిలి ఉన్న ఫ్లాట్లను య‌ధాత‌ధ స్థితిలో విక్రయించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెల్ల‌డించారు. విక్ర‌య మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వెబ్ సైట్ లో ఉంచుతామ‌న్నారు.

 

గ‌త ప్ర‌భుత్వం అప్పుల‌ను స‌కాలంలో చెల్లించ‌క‌పోవ‌డంతో నిర‌ర్ధ‌క ఆస్తుల రిక‌వ‌రీ చ‌ట్టాన్ని ఉప‌యోగించేందుకు బ్యాంకులు సిధ్ద‌మైన నేప‌థ్యంలో గృహ నిర్మాణ శాఖ స్పెష‌ల్ ఛీప్ సెక్ర‌ట‌రీ చిత్ర రామ‌చంద్ర‌న్ బ్యాంకు అధికారుల‌తో ప‌లు ద‌ఫాలు చ‌ర్చించారు. బ్యాంకు రుణాల‌ను చెల్లించేందుకు ప్ర‌భుత్వం సిధ్దంగా ఉంద‌ని బ్యాంకు అధికారుల‌కు వివ‌రించారు.  ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే మిగిలిన బ‌కాయిల‌ను చెల్లిస్తామ‌ని వారికి చెప్పారు. దీనికి అంగీక‌రించిన బ్యాంకు అధికారులు ఫ్లాట్ల విక్ర‌యానికి అభ్యంత‌రం లేద‌ని గృహ నిర్మాణ శాఖ స్పెష‌ల్ ఛీప్ సెక్ర‌ట‌రీ చిత్ర రామ‌చంద్ర‌న్ కు తెలిపారు.

 

మొద‌టి ద‌శ‌లో బండ్లగూడ‌లో ఉన్న 2245 ఫ్లాట్లను, పోచారంలో ఉన్న 1474 ఫ్లాట్లను రాజీవ్ స్వ‌గృహ విక్ర‌యించ‌నుంది.బండ్లగూడ‌లోని 2245 ఫ్లాట్లలో 316 గృహ ప్రవేశాల‌కు సిద్ధంగా ఉన్నాయని, మ‌రో 1929 ఫ్లాట్లలో చిన్న చిన్న ప‌నులు మిగిలి ఉన్నాయ‌ని  మంత్రి  వివ‌రించారు. వీటిని ఆన్ లైన్ వేలం ద్వారా కొనుక్కున్నవారే మిగతా ప‌నులు చేసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు. పోచారంలో మొత్తం 1474 ఫ్లాట్లకు గాను, 969 ఫ్లాట్లలో ప‌నులు పూర్తి కాగా, 505 ఫ్లాట్లకు ఇంకా కొన్ని ప‌నులు చేయాల్సి ఉంద‌న్నారు. ప్రతి ఫ్లాటుకు ప్రత్యేకంగా ధ‌ర‌ను నిర్ణయించి ఆన్ లైన్ లో అమ్మనున్నారు. బండ్లగూడ‌లో  నిర్మాణం పూర్తైన వాటికి చ‌ద‌ర‌పు అడుగుకు రూ.1900 గా, సెమీ ఫినిష్డ్ ప్లాట్స్ కు రూ.1700 గా నిర్ణ‌యించారు.  పోచారంలో నిర్మాణం పూర్తైన ప్లాట్స్ చ‌ద‌ర‌పు అడుగుకుకు రూ. 1700 గా, సెమీ ఫినిష్డ్  వాటికి రూ. 1500 గా నిర్ణ‌యించారు. చ‌ద‌ర‌పు అడుగుకు రూ. గా నిర్ణయించారు. ఈ ఫ్లాట్ల అమ్మకం ద్వారా గృహ నిర్మాణ శాఖ‌కు రూ. 545 కోట్లు ఆదాయం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *