రాజీనామా యోచనలో సుష్మస్వరాజ్.?

-మోడీపై సుష్మ అసంతృప్తి -ఎప్పుడైనా రాజీనామా చేస్తారని ఊహాగానాలు

హైదరాబాద్:బీజేపీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన సుష్మా స్వరాజ్ రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు హస్తినలో జోరందుకున్నాయి. మోడీతో కలిసి పనిచేయలేకపోతున్న సుష్మా రాజీనామాకే సిద్దపడుతున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి ఇద్దరి మధ్య ఉన్న విబేధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. బ్రిక్స్ సమావేశాల పర్యటనలో కానీ, జపాన్ టూర్ కానీ మోడీ కనుసన్నుల్లోనే జరిగాయి. విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మాకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ముందు ముందు కూడా మోడీనే విదేశాంగ విధానాన్ని నేరుగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. అధికారుల నియామకంలోనూ మోడీనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తనకు లేదా విదేశాంగ మంత్రికి అధికారిక ప్రతినిధి అంటూ ఎవరూ ఉండరని ఇంతకుముందే ప్రకటించారు. విదేశాంగ శాఖ అధికారులతో మోడీ నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు.
ఎప్పుడైనా రాజీనామా చేసే అవకాశం…
సుష్మా స్వరాజ్ కు విదేశాంగ శాఖ బాధ్యతలు నిర్వహించడం కొత్తైనా ఎంతో అనుభవమున్న మంత్రిగా వ్యవహరిస్తున్నారు. విదేశీ ప్రతినిధులతో ఆమె దౌత్య పరమైన వ్యవహారశైలిపై ప్రశంసలు కురుపిస్తున్న వారూ ఉన్నారు. ఇలా ఆమె పనితీరును ప్రశంసిస్తున్న విదేశాంగ శాఖ ఉన్నతాధికారులే సుష్మా ఎంతకాలం పదవిలో ఉంటారోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తుంటే ఆమె ఎప్పుడైనా రాజీనామా చేసే అవకాశముందంటున్నారు.
ఆగ్రహంతో రగిలిపోతున్న రాజ్ నాథ్….
అందరికంటే ఎక్కువగా ప్రధాని అభ్యర్ధిగా మోడీని ప్రమోట్ చేసిన రాజ్ నాథ్ సింగ్ విషయంలోనే ఆయన కఠినంగా వ్యవహరించారు. హోంశాఖ ఇచ్చినా వ్యక్తిగత సిబ్బందిని నియమించుకునే అధికారాలు సైతం ఇవ్వలేదు. దీంతో ఇప్పటికే పార్టీ మాజీ అధ్యక్షుడు మోడీపై అసహనంతో రగలిపోతున్నారు. ఇప్పుడు సుష్మా సైతం ఆందోళనగా ఉన్నారు.
అద్వానీలా తప్పుకోవాల్సి వస్తుందని ఆందోళన…
మోడీపై ఆగ్రహంతో ఉన్న వీరందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే.. రాజీనామాలు చేయకుండా అడ్డుపడుతుంది. తామంతట తామే రాజీనామాలు చేస్తే రాజకీయంగా భవిష్యత్తు దెబ్బతింటుందని అటు పార్టీలోనూ కీలక పదవులు ఖాళీ లేకపోవడంతో అద్వానీ తరహాలో మార్గదర్శక మండలి లేదా గవర్నర్లగా మారాల్సి వస్తుందని ఆలోచిస్తున్నారట. అందుకే సమయం కోసం ఎదురుచూస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. వీరిని వదిలించుకోవాలని మోడీ.. జాగ్రత్తగా అడుగులు వేయాలని మంత్రులు ఎవరికి వారు సమయం కోసం చూస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.