Breaking News

రంగనాయక సాగర్ పనుల ఆకస్మిక తనిఖీ

రంగనాయక సాగర్ పనుల ఆకస్మిక  తనిఖీ

463 కోట్లతో 3 టీఎంసీల సామర్థ్యం.

లక్షా 10 వేల ఎకరాలకు సాగునీరు.

మరో మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశం.

శ్రీరామనవమి నాడు రంగనాయక సాగర్ పనుల ఆకస్మిక  తనిఖీ.

రిజర్వాయర్ల వలయంగా సిద్ధిపేట.

రంగనాయక సాగర్ పనులు వేగం పెంచాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. వచ్చే వానాకాలంలో నీరు ఇచ్చే లక్ష్యంగా పని చేయాలని అధికారులను ఆయన కోరారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చిన్నకోడూర్ మండలం చంద్లపూర్  దగ్గర నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్ పనులను మంత్రి సోమవారం ఆకస్మిక  తనిఖీ చేశారు. రంగానాయక స్వామి దీవెనలతో  రంగానాయక సాగర్ పూర్తయి గోదావరి జలాలతో ఈ ప్రాంతం పావనం అవుతుందని ఆయన అన్నారు.వచ్చే శ్రీరామ నవమికి రంగాయక గుట్ట నిండు కుండలా మారుతుందన్నారు.రంగానాయక సాగర్ తో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారనుందని చెప్పారు.కరువు పీడిత ప్రాంతంగా ఉన్న చిన్నకోడూర్ మండలం ఆకుపచ్చని ప్రాంతంగా రూపురేఖలు మారిపోనున్నవని హరీశ్ రావు చెప్పారు. రంగనాయక సాగర్ పనుల పురోగతిని ఆయన క్షేత్ర స్థాయిలో  సమీక్షించారు. పనులు వేగవంతం చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన  దిశా నిర్దేశం చేశారు. రంగనాయక సాగర్ రిజర్వాయరు కట్ట కు సంబంధించిన 2100 ఎకరాల భూసేకరణ పూర్తయింది. పైపులైను  పనులు  మొదలు పెట్టాలని కోరారు. రంగనాయక సాగర్ రిజర్వాయరు వెనుకవైపున  ఎఫ్ .ఆర్. ఎల్ వద్ద ఈత మొక్కలు నాటి, ఆ ప్రాంతమంతా ఈత వనాలు ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. రంగనాయక సాగర్ రిజర్వాయరులో అప్రోచ్ కెనాల్స్, టన్నెల్  పనులు తొందరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులు , ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్ లోని ఎడమ కాలువ పనులు జాప్యం జరగకుండా చూడాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో  తెలంగాణలోని 19 జిల్లాలలో   బీడువారిన పొలాలు గోదావరి జలాల రాకతో పచ్చని పంట పొలాలుగా మారనున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రిజర్వాయర్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని  ఆయన గుర్తు చేశారు. జిల్లాలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ ద్వారా లక్షా 10వేల ఎకరాలకు సాగునీరు  అందించనున్నట్టు మంత్రి చెప్పారు. రిజర్వాయర్ నిర్మాణ పనులు 463 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు.సిద్ధిపేట జిల్లా  రంగనాయకసాగర్ , కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల వలయంగా మారనున్నట్టు హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. ఈ రిజర్వాయర్ల ద్వారా సిద్దిపేట జిల్లాకే కాకుండా ఉమ్మడి మెదక్  జిల్లాకు సాగునీరును అందించే కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్టు ఆయన తెలియజేశారు.

కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి పొరుగున ఉన్న పూర్వ  నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకు కూడా సాగునీరు అందుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌మానేరు నుంచి సిద్ధిపేట  జిల్లా సరిహద్దులోని అనంతగిరి  రిజర్వాయర్‌కు నీళ్లు వస్తాయని, అక్కడి నుంచి టన్నెల్, ఓపెన్ కెనాల్ ద్వారా చిన్నకోడూరు మండలంలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను నింపనున్నట్టు ఇరిగేషన్ మంత్రి తెలిపారు. రిజర్వాయర్ నుంచి కొమురవెల్లి మల్లన్నసాగర్, అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్లకు నీళ్లు తరలిస్తామని ఆయన చెప్పారు. మరో మూడు నెలల్లో  రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను పూర్తి చేసి గోదావరి జలాలతో రిజర్వాయర్ నింపాలన్న లక్ష్యంగా పనులు జరుగుతున్నట్టు హరీశ్ రావు పేర్కొన్నారు.  చిన్నకోడూరు మం డలంలోని చంద్లాపూర్, రామంచ, లింగారెడ్డిపల్లి, ఇమాంబాద్, పెద్దకోడూరు గ్రామాల శివారుల మధ్య రంగానాయకసాగర్  రిజర్వాయర్‌ నిర్మానమవుతున్నది. ఈ రిజర్వాయర్ కట్ట సుమారు 8.65 కిలోమీటర్ల పొడవు విస్తీర్ణంలో ఉంది. రంగనాయకసాగర్ రిజర్వాయర్ చుట్టూ కట్ట నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ రిజర్వాయర్ కట్ట ఎత్తు 32.4 మీటర్లు కాగా గ్రౌండ్ లెవల్‌లో కట్ట వెడల్పు 196 మీటర్లతో ఉండి పైభాగానికి వచ్చే సరికి 6 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 3 టీఎంసీలు. రిజర్వాయర్ నుంచి కుడి ఎడమ కాల్వల ద్వారా సాగునీరు ఇస్తారు. ఎడమ కాల్వ ద్వారా 70 వేల ఎకరాలు, కుడి కాల్వ ద్వారా 40వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *