
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు చెందిన భూసేకరణ, అటవీ, పర్యావరణ, వన్య ప్రాణి అనుమతులు, పంప్ హౌజ్ లు, కెనాల్స్, ఇతర పనుల పురోగతిపై జలసౌధలో మంత్రి హరీశ్ రావు శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు. 6 లక్షల 74 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతి ఇంకా వేగంగా జరగాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 345534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనునుంది.328853 ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం లభిస్తుంది. ప్యాకేజీల వారీగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. మొత్తం 8 ప్యాకేజీలలో ప్రస్తుతం 3 ప్యాకేజీల పనులను ప్రారంభించారు. మిగతా 5 ప్యాకేజీల పనులలో ప్యాకేజీ 4,5,6,7 పనులకు అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయింది. అలాగే ప్యాకేజీ 8 పనులను కూడా సంబంధిత ఏజెన్సీ తో అగ్రిమెంట్ పూర్తి చేసి ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మొత్తం 5 పంప్ హౌజ్ లలో ఒక పంప్ హౌజ్ పనులే గ్రౌండ్ అయ్యాయి. మరొక పంప్ హౌజ్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే మిగతా 3 పంప్ హౌజ్ ల పనులను కూడా వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పంప్ హౌజ్ పనుల తో సహా ఇతర అన్నీ పనులకు సంబంధించి ఎప్పటిలోగా పూర్తి చేయనున్నారో తేదీల వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి తనకు తెలియజేయాలని హరీశ్ రావు ఆదేశించారు. ఇకపై రెగ్యులర్ గా సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష జరపనున్నట్టు హరీశ్ రావు ప్రకటించారు. సీతారామ ఎత్తిపోతల పథకం కోసం మొత్తం 4445 ఎకరాల భోసేకరణ జరగవలసి ఉన్నది. ఇందులో 374 ఏకరాలే సేకరణ పూర్తయ్యింది. మిగతా భూసేకరణ ప్రక్రియకు టాప్ ప్రయారిటీ ఇచ్చి ఈ పనులు పూర్తయ్యేలా చూడాలని సమీక్షా సమావేశం నుంచే మంత్రి హరీష్ రావు కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కలెక్టర్లు రాజీవ్ హనుమంతు, లోకేశ్, ఖమ్మం జిల్లా అటవీ ఉన్న్తాధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా 4900 ఎకరాలను జగిత్యాల జిల్లాలో గుర్తించారు. ప్రత్యామ్నాయ భూములను అటవీ శాఖకు బదలాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని హరీష్ రావు జగిత్యాల కలెక్టర్ శరత్ ను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టులోని అన్నీ ప్యాకేజీలలోనూ యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని హరీశ్ రావు సూచించారు. ఈ ప్రాజెక్టుకు చెందిన అటవీ, పర్యావరణ అనుమతులపై జాప్యం చేయరాదని అన్నారు. సీతారాం ప్రాజెక్టుకు చెందిన మొదటి దశకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. అటవీ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకొని మిగతా అటవీ భూముల సేకరణ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మోటార్లు, సివిల్, మెకానికల్ విభాగాలకు చెందిన పెండింగ్లో ఉన్న డిజైన్ లను వెంటనే పూర్తి చేయాలని సి.ఈ. సి.డి .వో ను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష లో ఇరిగేషన్ ఈ. ఎన్ .సి. మురళీధర్ రావు, సీతారామా ప్రాజెక్టు సి.ఈ. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.