యుద్ధప్రాతిపదికన మిషన్ భగీరథ పనులు: మంత్రి హరీష్ రావు

 

హై వే పనులలో వేగం పెంచాలి.

సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి.

వచ్చే ఏడాదికి గజ్వేల్ కు రైలు.

మంత్రి హరీశ్ రావు సమీక్ష.

మిషన్ భగీరథ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అలసత్వాన్ని సహించేది లేదని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు అన్నారు. డిసెంబర్ చివరికల్లా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాలకు బల్క్ నీటి సరఫరా జరగాలని ఆయన ఆదేశించారు. ఇది అత్యంత ప్రాముఖ్యమున్న కార్యక్రమం అని గుర్తు చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ పథకాలు, జాతీయ రహదారుల నిర్మాణం,మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైను తదితర అంశాలపై హరీశ్ రావు గురువారం సుదీర్ఘంగా సంబంధిత అధికారులు,ఎం.ఎల్.సిలు, ఎం.ఎల్.ఎలు,ఎం.పిలతో సమీక్షించారు. ప్రతి శనివారం ఇకపై ‘మిషన్ భగీరథ డే’గా భావించి ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఆర్.డబ్ల్యు, ఎస్.అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుని పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.ఎం.ఎల్.ఎలు.ఎం.ఎల్.సి లు ఆర్.డబ్ల్యు. ఎస్.అధికారులు సమన్వయంతో పని చేసి త్వరితగతిన భగీరథ పనులు పూర్తి చేయాలని కోరారు. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లో మిషన్ భగీరథ పనులు వేగం పెంచాలని సిద్ధిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ ను ఆదేశించారు. ఈ డిసెంబర్ 31 లోపున హుస్నాబాద్ సెగ్మెంట్ లో పనులు పూర్తి చేయగలిగితే యావత్తు భారత దేశంలోనే ఇంటింటికి నల్లా ద్వారా రక్షిత తాగునీటిని అందించిన తొలి జిల్లాగా సిద్ధిపేట నమోదు అవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇంతవరకు ఒక్క ఓహెచ్ ఆర్సీ కూడా లేని గ్రామానికి ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఓహెచ్ ఆర్ సి లను నిర్మించాలని కోరారు.ప్రతి వారం భగీరథ పనులను జిల్లా కలెక్టర్ సమీక్షించాలని కోరారు. ప్రతి నెలా జరిగే మహిళా సంఘాల సమావేశంలో సైతం ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని కోరారు.మెదక్ ఎం.పి. ప్రభాకర్ రెడ్డి దత్తత గ్రామం లకుడారం లో భగీరథ పనులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నారాయణ ఖేడ్, ఆందోలు, నరసాపూర్ లలో పూర్తయిన్ భగీరథ పథకాలను త్వరలో ప్రారంభించనున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే లైను పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. వచ్చే యేడాది గజ్వెల్ కు రైలు నడవాల్సిందేనని అన్నారు. రైల్వే లైన్ ,రైల్వే స్టేషన్ల నిర్మాణం ఇతర పనుల పురోగతిని హరీష్ రావు సమీక్షించారు.2018 జూన్ కల్లా రైల్వే పనులు పూర్తి కావాలని రైల్వే అధికారులను ఆయన ఆదేశించారు.మనోహరాబాద్,కొత్తపల్లి మార్గం లో పెండింగ్ లో ఉన్న 6 ఎకరాలకు సంబంధించిన అటవీ భూముల సమస్య పై తెలంగాణ అటవీ శాఖ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ తో మాట్లాడారు. తక్షణమే పరిష్కరించాలని కోరారు. తూప్రాన్ మండలం పరికిబండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న ఈ భూముల సేకరణ కు అడ్డంకులు తొలగిపోతాయని పి.సి.సి.ఎఫ్.
ఝా హామీ ఇచ్చారు.అలాగే మెదక్-అక్కన్నపేట మార్గం లో భూసేకరణ కు సంబంధించిన పరిహారం తక్షణం చెల్లించాలని మంత్రి ఆదేశించారు. రైల్వే పనులు ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నదానికన్నా చాలా నెమ్మదిగా సాగుతున్నట్టు హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రామాయంపల్లి దగ్గర రోడ్డు ఓవర్ బ్రిడ్జి, గజ్వేల్ సమీపంలో ఆర్.ఓ.బీ, ఆర్.యు.బి.నిర్మిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.మొత్తం 1090 ఎకరాలకు గాను 690 ఎకరాల భూసేకరణ పూర్తయినట్టు రైల్వే అధికారులు చెప్పారు. కుకునూరుపల్లి,దుద్దేడ తదితర చోట్ల భూసేకరణ పెండింగ్ లో ఉందన్నారు. సిద్ధిపేట రైల్వే స్టేషన్ భవనాల నిర్మాణ పనులకుగాను రెండు నెలల్లో టెండర్లు పిలవనున్నట్టు రైల్వే సి.ఈ.నాగభూషణ రావు మంత్రి కి వివరించారు. దౌల్తాబాద్ ప్రాంతాల్లో కూరగాయలు ఎక్కువగా పండిస్తారని,హైదరాబాద్ వంటి ప్రాంతాలకు రవాణా చేస్తారని ఆ మండలం లో ఒక స్టేషన్ ఏర్పాటు చేయాలని హరీశ్ రావు సూచించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి కి లేఖ రాయవలసిందిగా ఎం.పి ప్రభాకర్ రెడ్డిని మంత్రి కోరారు. సిద్ధిపేట-సిరిసిల్ల మధ్య గుర్రాల గొంది, చిన్న కోడూరులలో స్టేషన్లు నిర్మాణం చేయాలని ఆదేశించారు.మెదక్-అక్కన్నపేట, మనోహరాబాద్ మార్గాల లో రైల్వే లైను నిర్మాణం, ఇతర అంశాలపై సమీక్షించారు.మనోహరాబాద్-గజ్వేల్ మధ్య రైల్వే లైను పనులు వేగం పుంజుకున్నాయని, ఫేజ్ 2 కింద గజ్వేల్-సిద్ధిపేట పనులు కూడా  చేపడుతున్నట్టు రైల్వే అధికారులు తెలియజేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాను కలుపుతూ వెళ్ళే జాతీయ రహదారుల నిర్మాణానికి గాను అవసరమైన భూములను 2017 తెలంగాణ భూసేకరణ చట్టం కింద సేకరించాలని గురువారం నాడు హైదరాబాద్ లో జరిగిన సమీక్ష సమావేశం లో మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర లకు వెళ్లే జాతీయ రహదారుల నిర్మాణంపై ప్రత్యేకంగా సమీక్షించారు.అలాగే ఇటీవల మంజూరు అయిన వివిధ జిల్లాల నడుమ ఫోర్ లైన్ రోడ్లు, అంతరజిల్లా రహదారుల పనులను మంత్రులు సమీక్షించారు.నాగపూర్-హైదరాబాద్, పూణే-హైదరాబాద్,సంగారెడ్డి-నాందేడ్-అకోలా, సిరిసిల్ల-సిద్ధిపేట-జనగామ, హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-రుద్రూర్,నిజాంపేట్-నారాయణ ఖేడ్-బీదర్, జహీరాబాద్-బీదర్-బెగ్లూర్,మెదక్-సిద్ధిపేట-ఎల్కతుర్తి తదితర రూట్లలో మంజూరు అయిన రోడ్ల నిర్మాణం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తుమ్మల, హరీష్ ఆదేశించారు.పూణే-హైదరాబాద్ రూటు లో దిగ్వాల్ దగ్గర సర్వీసు రోడ్లు నిర్మించాలని కోరారు. జహీరాబాద్ దగ్గర ఆర్.ఓ.బి.ని వెంటనే చేపట్టాలని కోరారు. సదాశివ పేట సమీపంలో గొల్లగూడెం దగ్గర రోడ్డు ప్రమాదాలు తరుచూ జరుగుతున్నందున అక్కడ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిజాంపేట్-నారాయణ ఖేడ్-బీదర్ మధ్య ఎన్.హెచ్ 50 లో 50 కిలోమీటర్ల జాతీయ రహదారినిర్మాణానికి నెలలోపు భూసేకరణ పూర్తి చేసి టెండర్లు పిలవాలని మంత్రులు కోరారు.సంగారెడ్డి-నాందేడ్-అకోలా మధ్య 140 కిలోమీటర్ల జాతీయ రహదారిలో మొదటి ప్యాకేజి పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.2వ ప్యాకేజి పనులు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నందున ముగ్గురు జిల్లా కలెక్టర్లు సమన్వయంతో ఈ పనులు చేపట్టాలని కోరారు.హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు -నర్సాపూర్-మెదక్ పనుల ను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. నర్సాపూర్, మెదక్ పట్టణాలలో నాలుగు లైన్ల రోడ్లు నిర్మించాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మ కోరారు.మెదక్-రుద్రూర్ మధ్య రోడ్డు నిర్మాణానికి నెలలో టెండర్లు పిలవాలని మంత్రులు ఆదేశించారు. జహీరాబాద్-బీదర్-బెగ్లూర్ రోడ్డుకు డిసెంబర్ లో టెండర్లు పిలవనున్నట్టు ఆర్అండ్ బి ఈ.ఎన్. సి.గణపతి రెడ్డి తెలిపారు. మెదక్-సిద్ధిపేట-ఎల్కతుర్తి రోడ్డు నిర్మాణ పనులు వచ్చే ఏడాది చేపట్టనున్నట్టు ఆయన మంత్రులకు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంది నుంచి చౌటుప్పల్ వరకు దాదాపు 180 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రతిపాదనలో ఉందని ఈ.ఎన్. సి.చెప్పారు. రాజీవ్ రహదారి పై గతంలో ప్రతిపాదించిన గ్రామాల దగ్గర సర్వీసు రోడ్ల నిర్మాణం పెండింగులో వుండడం పట్ల మంత్రి హరీశ్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దుద్దేడ దగ్గర సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్, రైల్వే స్టేషన్ వస్తున్నందున అక్కడ త్వరితగతిన బైపాస్ రోడ్డు నిర్మించాలని సూచించారు.
రహదారుల   సమీక్ష సమావేశంలో  మంత్రులు తుమ్మల, హరీష్ రావు పాల్గొన్నారు.
మిగతా సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మ,ఎంపిలు బి.బి.పాటిల్, కొత్త ప్రభాకరరెడ్డి, ఎం.ఎల్.ఏ.లు బాబూమోహన్, చింతా ప్రభాకర్, రామలింగారెడ్డి,మదన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, భూపాలరెడ్డి, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్,ఫారూఖ్ హుస్సేన్, భూపాల్ రెడ్డి ,జడ్ పి చైర్మన్ రాజమని, ఎలక్షన్ రెడ్డి, భూంరెడ్డి,సంగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్లు మాణిక్ రాజ్,హోలీ కెరీ, సిద్ధిపేట జాయింట్ కలెక్టర్ రుక్మరెడ్డి ,ఆర్.డబ్ల్యు. ఎస్.సి.ఈ.విజయప్రకాశ్, ఆర్ అండ్ బి ఈ.ఎన్. సి.గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.             IMG-20171102-WA0378

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *