యాదాద్రిగా యాదగిరి గుట్ట

నల్గొండ, ప్రతినిధి : యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్దికోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలన్నీ ఆగమ శాస్త్రం ప్రకారమే ఉన్నాయని, ఆలయ పవిత్రత, సంప్రదాయం, ప్రత్యేకతలు చెక్కు చెదరకుండా సమగ్ర అభివృద్ది కోసం చేసిన ప్రణాళికలు అధ్బుతంగా ఉన్నాయని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్‌ స్వామి అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుతో కలిసి చిన్న జీయర్‌ స్వామి గురువారం యాదగిరిగుట్టపై ఏరియల్‌ సర్వే నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకున్న వీరిద్దరు గుట్ట చుట్టూ హెలికాప్టర్‌లో తిరిగారు. లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న ప్రధాన యాదగిరిగుట్టతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది చేయదలుచుకున్న చుట్టు ప్రక్క గుట్టలను కూడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ చిన్న జీయర్‌ స్వామికి చూపించారు. యాదగిరిగుట్టకు దారితీసే రాయగిరి, వంగపల్లి, తుర్కపల్లి, రాజుపేట మార్గాలను, ఆయా ప్రాంతాలలో చేపట్టే పనులను ముఖ్యమంత్రి వివరించారు. రాయగిరి, యాదగిరి గుట్ట చెరువులను కూడా చూపించి వాటిని పర్యాటక కేంద్రాలుగా మిషన్‌ కాకతీయ కార్యక్రమం ద్వారా తీర్చిదిద్దుతామని చెప్పారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో రిజర్వు ఫారెస్టుగా ఉన్న ప్రాంతాన్ని కూడా చూపించి నరసింహస్వామి అభయారణ్యపు ప్రతిపాదనలను చెప్పారు. నేషనల్‌ హైవే, రైల్వే లైను ప్రక్కనే ఉండడాన్ని కూడా చూపించి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు సుళువుగా ఈ పుణ్యక్షేత్రానికి రావచ్చని చెప్పారు.

యాదగిరిగుట్టలో నరసింహస్వామికి, ఆంజనేయస్వామికి ఈ ఇద్దరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల తరువాత చిన్న జీయర్‌ స్వామికి ఆలయ ప్రాంగణంలోని అణువణువును ముఖ్యమంత్రి చూపించారు. పద్నాలుగున్నర ఎకరాల స్థలం గుట్ట పైభాగంలో వేరు వేరు ఎత్తుల్లో అందుబాటులో ఉందని చెప్పారు. ఆరు ఎకరాల స్థలంలో ప్రధాన ఆలయం అభివృద్ది చేస్తామని, దాని చుట్టూ మాడ వీధులు నిర్మిస్తామని, మ్యాపుల సహాయంతో ముఖ్యమంత్రి వివరించారు. గుట్టపైనే 32 నరసింహుని రూపాలను ప్రతిష్టించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ నవగిరులకు నామ కరణం చేయాల్సిందిగా చిన్న జీయర్‌ స్వామిని ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుత యాదగిరిగుట్టకు యాదాద్రిగా చిన్న జీయర్‌ స్వామి నామ కరణం చేశారు. మిగతా 8 గుట్టలకు త్వరలోనే పేర్లు పెడతామన్నారు. భక్తులు, పర్యాటకుల కోసం ఈ ప్రాంతంలో తిరిగేందుకు మోనో రైలు ఏర్పాటు చేయడం, దేవస్థానం ఆధ్వర్యంలోనే వాహన సౌకర్యం కల్పించడం లాంటి ఆలోచనలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.

యాదగిరిగుట్ట అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు చేస్తున్న ప్రయత్నాలను చిన్న జీయర్‌ స్వామి అభినందించారు. ఆగమ శాస్త్రం, వైదిక సంప్రదాయాలు, ఆచార విధానల ప్రకారమే ఈ ప్రతిపాదనలన్నీ ఉన్నాయని చెప్పారు. ఒక దివ్య క్షేత్రానికి ఏటా వంద కోట్ల రూపాయలు బడ్జెట్‌ కేటాయింపులు జరపడం కూడా భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారి అని చిన్న జీయర్‌ స్వామి అభినందించారు. అందరూ చంద్రశేఖర్‌ రావులు కాలేరని, చంద్రశేఖర్‌ రావులాంటి కొందరు వ్యక్తులు మాత్రమే అందరికి స్పూర్తిగా నిలుస్తారని అన్నారు. అంకిత భావం, శ్రద్ద కలిగిన కేసిఆర్‌కు జాతి రుణపడి ఉంటుందని చిన్న జీయర్‌ స్వామి అన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ది కోసం కేసిఆర్‌ చేస్తున్న ప్రయాత్నాలన్నీ విజయవంతం కావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చిన్న జీయర్‌ స్వామి వెల్లడించారు.

ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటి చైర్మన్‌ విద్యాసాగర్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, భువనగిరి ఎంపి బూర నర్సయ్య, ఎమ్మెల్యేలు శేఖర్‌రెడ్డి, వీరేశం, ఆలయ ఇఓ గీత, జేసి సత్యనారాయణ, డిఎఫ్‌ఓ సత్యనారాయణ, యాదగిరి డెవలప్‌మెంట్‌ అథారిటి వైస్‌ ప్రెసిడెంట్‌ కిషన్‌రావు,ఆర్కిటెక్టులు రాజ్‌, జగన్‌, టెంపుల్‌ ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి, స్థపతి సౌందర్‌రాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *