
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న 104 బస్తీ దవాఖానలు, 30 ఈవీనింగ్ క్లీనిక్‌లను మరింత పటిష్టం చేయడంతో పాటు కొత్తగా 97 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం, వృద్దులకోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న 88 డేకేర్ సెంటర్లలో 30 కేంద్రాల్లో ప్రత్యేకంగా యోగా, ఫిజియోథెరఫి, ప్యాలియాటిక్ కేర్ లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా నిర్ణయించాయి. గ్రేటర్లో బస్తీ దవాఖానల నిర్వహణపై జీహెచ్ఎంసీ మెడికల్ ఆఫీసర్లు, యు.సి.డి ప్రాజెక్ట్ అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్యాధికారులతో రాష్ట్ర ఆరోగ్య, కుటంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్‌లు నేడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు సిక్తాపట్నాయక్, సందీప్జాలు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ ప్రస్తుతం పనిచేస్తున్న బస్తీ దవాఖానలలో 200 రకాల పరీక్షలు నిర్వహించడంతో పాటు 135 రకాల మందుల పంపిణీ జరుగుతున్నందున ఈ బస్తీ దవాఖానలను ప్రతిరోజు కనీసం వంద మందికిపైగా వైద్య పరీక్షలకు వచ్చేవిధంగా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న మహల్లా క్లీనిక్ ల స్పూర్తితో ఏర్పాటుచేసిన ఈ బస్తీ దవాఖానలు నిర్వహణ పరంగా వాటికంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం బస్తీ దవాఖానలకు రోజుకు సుమారు 50 నుండి 60 మంది మాత్రమే వైద్య పరీక్షలకు వస్తున్నారని, ఈ నెలాఖరులోగా కనీసం ఒక్కో కేంద్రానికి వంది మంది వచ్చేలా నగరంలోని స్వయం సహాయక బృందాల సభ్యులు, బస్తీవాసులను చైతన్యపర్చాలని యు.సి.డి అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రతిఒక్క పేద కుటుంబం వైద్య అవసరాలకై కనీసం రూ. 10వేలను వ్యయం చేస్తున్నారని తెలిపారు. నగరంలో ఉన్న 1,090 స్లమ్ లేవల్ ఫెడరేషన్ల సమావేశాల్లో బస్తీ దవాఖానాల్లో అందుబాటులో ఉన్న వైద్య పరీక్షలు, మందుల పంపణీ, చికిత్సలపై అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. నగరంలో 5 నుండి 10వేల జనాభా వరకు ఒక బస్తీ దవాఖానను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని, దీనిలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న 97 బస్తీ దవాఖానలకు కావాల్సిన భవనాలను 15 రోజుల్లోగా ఎంపిక చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను దానకిషోర్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న బస్తీ దవాఖానలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వెంటనే చేపట్టాలని ఇంజనీరింగ్ అదికారులను ఆదేశించారు.
డేకేర్ సెంటర్లు కాదు…ఇక నుండి వయోజనుల సృజన కేంద్రాలు
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వయోవృద్దుల సంక్షేమానికి హైదరాబాద్‌లో 88 డేకేర్ సెంటర్లను నిర్వహిస్తున్నామని, వీటిని ఇక నుండి హెల్డర్స్ రిక్రియేషన్ సెంటర్లుగా మార్చాలని దానకిషోర్ ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న 88 డేకేర్ సెంటర్లలో వృద్దుల సౌకర్యార్థం యోగా, ఫిజియోథెరఫి ఇన్స్ట్రక్టర్లను నియమించడంతో పాటు పాలియాటిక్ కేర్ చికిత్సలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. నగరంలోని ఆసరా గుర్తింపు కలిగిన వృద్దులకు ఆగష్టు 15వ తేదీన ప్రత్యేకంగా క్రీడా పోటీలను నిర్వహించాలని నిర్ణయించామని కమిషనర్ పేర్కొన్నారు.
నగరంలో అదుపులో ఉన్న అంటువ్యాధులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత సంవత్సరాలను పోల్చి చూస్తే అంటువ్యాధులైన మలేరియా, డయేరియా, డెంగ్యు వ్యాధులు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ వెల్లడించారు. నగరంలో ఇప్పటి వరకు కేవలం 65 అనుమానస్పద డెంగ్యు కేసులు మాత్రమే నమోదైనట్టు రికార్డులు తెలుపుతున్నాయని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల నివారణకై చేపట్టిన ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రేటర్ పరిధిలో 500 ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలనే లక్ష్యానికిగాను ఇప్పటి వరకు 400లకు పైగా వైద్య శిబిరాల నిర్వహణ పూర్తి అయ్యిందని దానకిషోర్ పేర్కొన్నారు.