మోడీ టూర్ పై ఒబామా ఆసక్తి…

న్యూఢిల్లీ : భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ఫ్లైట్ ఎప్పుడెప్పుడు ఎక్కుదామని చూస్తున్నట్లే అమెరికా అధ్యక్షుడు ఒబామా అంతేస్థాయిలో ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈనెలాఖరున మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. అసలు అమెరికా ఎందుకు మోడీకి అంత ప్రాముఖ్యతనిస్తోంది ? తెలుసుకోవాలంటే ఇది చదవండి..
అప్పుడు వీసా నిరాకరణ..ఇప్పుడు ఒకే..
ఇటీవల భారత్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ విజయం సాధించి ప్రధాని పీఠం ఎక్కారు. గతంలో ఆయన అమెరికా పర్యటన జరపాలని అనుకున్నా అది వీలు కాలేదు. 2002 సంవత్సరంలో గుజరాత్ లో జరిగిన అల్లర్ల కారణంగా మోడీకి వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ప్రధాని పీఠం ఎక్కిన మోడీకి అమెరికా ప్రస్తుతం ప్రాధాన్యం ఇస్తోంది. దీని వెనుక ఆసక్తికర కారణాలే ఉన్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్‌ ను తన వైపు తిప్పుకోవాలంటే మోడీని దువ్వడం అనివార్యం. గతంలో మన్మోహన్‌సింగ్‌ మాదిరిగానే ఇప్పుడు మోడీని కూడా తన కనుసన్నల్లో వుంచుకునేందుకు వీలుగా అమెరికా పావులు కదుపుతోంది.
వాణిజ్య ఒప్పందాలు..
ఒకవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తగ్గిపోతున్న అమెరికా ప్రాధాన్యత, మరోవైపు చైనా సూపర్‌పవర్‌గా ఎదుగుతుండడం అమెరికాకు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో భారత్‌తో పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని అమెరికా భావిస్తోంది. అందుకే మోడీ ప్రధానిగా ఎన్నికైన వెంటనే అమెరికా అధ్యక్షుడు ఒబామా మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి జాన్‌ కెర్రీ, రక్షణ కార్యదర్శి చక్‌ హెగెల్‌లు భారత్‌కు వచ్చి మోడీని కలిసి వెళ్లారు.
వైట్ హౌస్ లో ఒబామాతో మోడీ భేటీ..
అమెరికా పర్యటన సందర్భంగా మోడీ సెప్టెంబర్‌ 29, 30 తేదీల్లో వైట్‌ హౌస్‌లో ఒబామాతో సమావేశమవుతారని వైట్‌ హస్‌ ప్రతినిధులు వెల్లడించారు. విదేశీ నేత ఒకరు రెండ్రోజుల పాటూ అధ్యక్షునితో వైట్‌హౌస్‌లో సమావేశం కావడం అత్యంత అరుదైన విషయం. దీనిని బట్టి అమెరికా మోడీ పర్యటనకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నదీ తెలుస్తోంది. భారత-అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో చర్చలు ఉంటాయని వైట్‌ హౌస్‌ చెబుతోంది. ఈ భేటీలో ఇరుదేశాల ఆర్థికాభివృద్ధి, రక్షణ ఒప్పందాలు, రెండు దేశాలకూ దీర్ఘకాలిక లాభం చేకూర్చే అంశాలపై చర్చిస్తారని సమాచారం. ఏదేమైనా.. మోడీ అమెరికా పర్యటన పూర్తయితే కానీ, అమెరికా మనుసులో ఏముందో వెల్లడయ్యే అవకాశం లేదు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.