
భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే అమెరికాలోని చాలా మంది ఎంపీలకు అభిమానం ఉన్నట్టుంది. అందుకే, మోడీ అమెరికా పర్యటనలో అమెరికా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని ఎంపీలు కోరుతున్నారు. అద్భుతమైన వక్తగా పేరు పొందిన మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినాలని వారు కోరుకుంటున్నారు.
కానీ పార్లమెంటు ఏడాది షెడ్యూలు ముందే ఖరారైందని, కాబట్టి ఇప్పుడు మోడీ ప్రసంగాన్ని ఏర్పాటు చేయడం కుదరదని సభాధ్యక్షులు సెలవివ్వడంతో ఎంపీలు నిరాశ పడ్డారు, మోడీ తమ దగ్గరికి వచ్చినా ఆయన ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినలేకపోవడం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రధానిగానే కాక, గుజరాత్ ను ప్రగతి పథంలో నడిపిన నేతగా మోడీకి క్రేజ్ ఉంది. మంచి వక్త అనే ఖ్యాతి ఉంది. భారతీయ అమెరికన్లే కాకుండా, పలువురు అమెరికా జాతీయులు, ఎంపీలు మోడీ రాకకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో చర్చనీయాంశ అంశాల్లో మోడీ పర్యటన ఒకటి. ఆ స్థాయిలో మోడీ రాకకు అమెరికా ప్రాధాన్యం ఇస్తోంది మరి.