
పర్యావరణ పరిరక్షణకు దోహదపడ మొక్కలను నాటడం ప్రతి పౌరుడు ప్రధమిక హక్కుగా భావించి ముందుకు రావాలని కరీంనగర్ ఇంఛార్జి డిఐజి డాక్టర్ టి.ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. భావితరాలకు ప్రకృతి ఫలాలను అందిచాల్సిన బాద్యత అన్నివర్గాల ప్రజలపై ఉందని పేర్కొన్నారు. గురువారం నాడు కరీంనగర్ రూరల్ మండలం ఎలగందల్ గ్రామంలోని పోలీస్ ఫైరింగ్ రేంజ్, ప్రభుత్వ మోడల్ పాఠశాలలో ఏర్పాటైన కార్యక్రమంలో ఇంఛార్జి డిఐజి డాక్టర్ టి.ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహోద్యమంగా కొనసాగుతున్న హరితహరం కార్యక్రమం పవిత్రమైందన్నారు. అటవీసంపద గణనీయంగా తగ్గిపోవడం వల్లనే కరువు కళారనృత్యం చేస్తూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, కరువును పారద్రోలి పంటపొలాలను సస్యశ్యామలం చేయడంతోపాటు ప్రకృతి పచ్చదనంతో వర్ధిల్లేలా చేయడం కోసం మొక్కలను నాటాలని చెప్పారు. ప్రతి పౌరుడు ఇంటికి రెండు మొక్కలను నాటాలని సూచించారు. జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ మాట్లాడుతూ అటవీసంపదను పెంపొందిచేందుకు మొక్కలను నాటాలన్నారు. జిల్లా పోలీస్ శాఖ హరితహరం కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ అప్రతిహతంగా కొనసాగిస్తుందని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణ, సర్కిల్ కార్యాలయాలు, ఎస్.డి.పి.వో, శిక్షణ కేంద్రాలు, దత్తత గ్రామాల్లో హరితహరం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, ఇప్నటి వరకు 4లక్షల మొక్కలు నాటడం లక్ష్యాన్ని చేధించి ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఫైరింగ్ రేంజ్ లో రెండు వేల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి టి.అన్నపూర్ణ, కరీంనగర్, ఎ.ఆర్. డి.ఎస్.డి జె.రామారావు, డి. కోటేశ్వరరావు, ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ టి. మహేష్ గౌడ్, ఆర్.ఐలు గంగాధర్, శశిధర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.