Breaking News

మైనింగ్ మాఫియా పై సీఎం కు ఫిర్యాదు

మైనింగ్ మాఫియా పై సీఎం కు ఫిర్యాదు

కరీంనగర్ జిల్లా మైనింగ్ మాఫియా ప్రకృతి సంపదను హరించివేస్తోందని, సహజసిద్దంగా ఏర్పడ్డ గుట్టలను నాశనం చేస్తూ భవిష్యత్తు వినాశనానికి నాంది పలుకుతున్నారని, వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు కటకం మృత్యుంజయం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు బుధవారం రాసిన లేఖలో కోరారు.

కరీంనగర్ జిల్లాలో గుట్టలను లీజుకింద తీసుకున్న గుత్తేదారులు- నిబంధనలు అతిక్రమించి అక్రమంగా మైనింగ్ చేస్తూ కోట్లు గడిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కరీంనగర్ వేములవాడ రహదారిలో వందల సంఖ్యలో ఉన్న గుట్టలు మైనింగ్ మాఫియా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. గుట్టల్లో బ్లాస్టింగ్ ల వల్ల పక్కనున్న పంటపొలాలు అక్కరకు రాకుండా పోతున్నాయని, బ్లాస్టింగ్ ల వల్ల దుమ్ము, ధూళి లేచి పంటలు నాశనమై అన్నదాతలు అల్లాడిపోతున్నారు.

గ్రానైట్ సమీప భూములు సాగుకు యోగ్యం కాకుండా మారిపోతున్నాయి. కనీసం పశువులకు గడ్డి కూడా మొలవకుండా జరుగుతున్న ఈ విధ్వంసం చెప్పటానికి తరం కాదు. గుట్టలు కనుమరుగై గుంతలు ఏర్పడుతున్న పరిస్ధితి ఏర్పడింది. ఈ బ్లాస్టింగ్ వల్ల భూగర్భ జలాలు అడుగంటి సమీప గ్రామాల్లో తాగు, సాగు నీటికి జనం ఇబ్బందులు పడుతున్నారు.
పోనీ గ్రానైట్ వల్ల వందల మందికి ఉపాధి దొరుకుతుందా అంటే అదీ లేదు. తమిళనాడు, రాజస్తాన్ లాంటి ప్రాంతాలనుంచి జనాన్ని తీసుకొచ్చి తక్కువ వేతనాలకు పనులు చేయించుకుంటూ స్ధానికులకు ఉపాధిని దూరం చేస్తున్నారు . గ్రానైట్ వ్యాపారులు, గ్రానైట్ వల్ల ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం అంతంత మాత్రమే. భవిష్యత్తు వినాశనానికి కారణమైన మైనింగ్ మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని కటకం మృత్యుంజయం కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *