
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జూయేల్ ఓరాంను కోరిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోళ ఇంద్ర కరణ్ రెడ్డి.
మంగళవారం ఢిల్లీలోని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జూయేల్ ఓరాంను ఆయన నివాసంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోళ ఇంద్ర కరణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సమావేశంలో భాగంగా గిరిజన కుంభమేళాగా పేరున్న మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర మంత్రి ని కోరారు. దాదాపు కోటి మంది భక్తులు పాల్గొనే ఈ పండుగ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అని కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోళ ఇంద్రకరణ్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ… మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర గిరిజన శాఖ మంత్రి జూయేల్ ఓరాం ను కోరినట్లు తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని వివరించారు. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తొలి సంవత్సరం 180 కోట్లను మంజూరు చేసిందని, ఈ సంవత్సరం 80 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు.
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు కోటి మంది పాల్గొనవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం 90 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని, ఈ సారి ఆ సంఖ్య మరింతగా పెరిగే నేపథ్యంలో సౌకర్యాల విషయాన్ని ప్రముఖంగా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే మేడారం జాతర జరిగే పుణ్యస్థలానికి నాలుగు లైన్ల రోడ్లు, మౌళిక వసతులు, పరిశుభ్రత సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 18 న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్ తో కలిసి మేడారంకు జాతర పనుల పురోగతిని సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరకు జార్ఖండ్,మధ్యప్రదేశ్,ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తారని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉత్తర భారత దేశంలో ఘనంగా జరుపుకునే వనజ్ ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించిందని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా భక్తి , శ్రద్ధలతో జరుపుకునే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని మంత్రి తెలిపారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు జి. నగేశ్, సీతారాం నాయక్ లు మీడియాతో మాట్లాడుతూ… మేడారం జాతరను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మరింత ఘనంగా మేడారం జాతరను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని నిర్ణయించారని, ఆ దిశలోనే రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం చేశారని గుర్తు చేశారు. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జూయేల్ ఓరాం ను కలిసిన బృందంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తో పాటూ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి, పార్లమెంట్ సభ్యులు జి.నగేశ్, సీతారాం నాయక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు.