
-లేట్ చేసేందుకు కేసీఆర్ అలైన్ మెంట్ మార్పు
-టేపులతో కొలిచి మరీ చెప్పిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: మెట్రో రచ్చలోకి టీ కాంగ్రెస్ ఎంటరైంది. మొన్నటి వరకు అధికార పక్షానికి, టీడీపీకే పరిమితమైన లొల్లిలో కాంగ్రెస్ కూడా వేలుపెట్టింది. మైట్రో అలైన్మెంట్ విషయంలో గులాబీ బాస్ పొలిటికల్ అజెండా ఉందని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. మెట్రో ద్వారా అసెంబ్లీ, అమర వీరుల స్తూపానికి ఏలాంటీ ప్రమాదం లేదని కేవలం కేసీఆర్ డ్రామా ఆడుతున్నారంటూ మండిపడుతున్నారు.
పనులు ఆలస్యం చేసేందుకు కేసీఆర్ కుట్ర
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బట్టీ విక్రమార్క, రాంమోహన్ రెడ్డి ఎమ్మెల్సీలు.. రంగారెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్లు స్వయంగా మెట్రోరైల్ పనులను పరీశీలించారు. ప్రస్తుతం మెట్రో పిల్లర్ల నుండి అమరవీరుల స్థూపం, అటునుంచి అసెంబ్లీకి మధ్య దూరాన్ని టేపులతో కొలిచారు. అసలు మెట్రో అలైన్ మార్చాల్సిన అవసరమే లేదని తేల్చిచెప్పారు. మెట్రోను ఆలస్యం చేసేందుకు కేసీఆర్ కావాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మెట్రో మార్గానికి మార్పులు చేయడం వల్ల ప్రజలపై దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పారు.
అసెంబ్లీకి, అమరుల స్థూపానికి ప్రమాదం లేదు..
టేపులతో నానా తంటాలు పడిన నేతలు… చివరకు మెట్రోరైల్ మార్గంలో మార్పులు అనవసరమన్నారు. మెట్రో రైల్ అసెంబ్లీ ముందునుండి పోవడం వలన అసెంబ్లీకి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి ప్రమాదం లేదని చెప్పారు. అయితే నిన్నటి వరకు టిడిపి -టిఆర్ఎస్ల మధ్య కొనసాగిన మెట్రో పంచాయితీలో కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయ సెగలు పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది.