
దేశీయ వైద్యంతో విస్తృత ప్రయోజనాలు
హోమియో వైద్యానికి ఉజ్వల భవిష్యత్తు
విద్యార్థులకు పోటీలు-పట్టాల పంపిణీ
అలరించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం- సాంస్కృతిక కార్యక్రమాలు
బతుకమ్మ ఆడిన మహిళా డాక్టర్లు
ముగిసిన హోమియో కాలేజీ స్వర్ణోత్సవాలు
హైదరాబాద్; రెండు రోజుల పాటు సాగిన హైదరాబాద్లోని రామాంతపూర్ జయసూర్య పొట్టిశ్రీరాములు హోమియో మెడికల్ కాలేజీ స్వర్ణోత్సవ సంబరాలు ముగిశాయి. శని, ఆదివారాలు జరిగిన ఉత్సవాలు అలరించాయి. దేశీయ
వైద్యంతోనే విస్తృత ప్రయోజనాలున్నాయన్నఅభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. హోమియో వైద్యానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. జయసూర్య పొట్టి శ్రీరాములు హోమియో మెడికల్ కాలేజీ స్థాపించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శని, ఆదివారాలు రెండు రోజులుపాటు ఆ కాలేజీ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు కలిసి స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ముగింపు రోజైన ఆదివారం ఉదయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా 1967 కళాశాల ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అన్నిబ్యాచ్ల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పూర్వ విద్యార్థులు
కళాశాలతో తమ అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఆడిపాడి హంగామా చేశారు. అలాగే మహిళా డాక్టర్లు బతకుమ్మ ఆడారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా హోమియో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యాద మాట్లడుతూ, దేశీయ వైద్యానికి అద్భుత భవిష్యత్తు ఉందన్నారు. ఉపనిషత్తులు, తరతరాల
అనుభవాలతో ఆయుర్వేదం, యునానీ, హోమియో, ప్రకృతి చికిత్స వంటి వైద్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్లేని వైద్యమని కొనియాడారు. తక్షణమే ఫలితాలిచ్చే అలోపతి వైద్యం అందుబాటులోకి వచ్చాక కొంత మబ్బైనట్లు కనిపించినా, ఇప్పుడు చాలా మంది తిరిగి ఆయుష్ వైద్యవిధానాల వైపు మళ్ళుతున్నారని ఆయన అన్నారు. అలోపతిలో నయం కాని అనేక రోగాలకు అద్భుత ఔషధాలు ఆయుష్లో ఉన్నాయని ఆయన చెప్పారు.
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ వైద్య విధానాలలో దేనికదే ప్రత్యేకమైనవైనప్పటికీ మూలం మాత్రం దేశీయ వైద్యంలోనే ఉన్నదన్నారు.
అయితే జనం ఇప్పుడు దేశీయ వైద్యం వైపు మళ్ళుతున్నారని ఆయన చెప్పారు. ఆయుష్ డైరెక్టర్, కమిషనర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎంతకూ నయం కానీ, జిడ్డు రోగాలను సైతం నయం చేసే ఔషధాలు ఆయుష్లో ఉన్నాయని చెప్పారు. ఆయుష్ వైద్యవిధానాలను మరింత ప్రాచుర్యంలో కి తేవాల్సిన అవసరం ఉందన్నారు. విస్తృత పరిచి, ప్రజలకు అందుబాటులోకి తెస్తే ఆయుష్ ఆయువు మరింత హెచ్చుతుందని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పాటు జరిగిన ఉత్సవాలపై ఆయన ఆనందం, సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాలకు ప్రేరణగా ముందుండి నడిపించిన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ కేంద్ర మంత్రి, జయసూర్య పొట్టిశ్రీరాములు హోమియో కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ వేణుగోపాల చారి మాట్లాడుతూ, తెలంగాణలో ఉన్న ఏకైక కాలేజీని విస్తృత పరచాలన్నారు. మరిన్ని ఆయుష్ కాలేజీలు రావాల్సిన అవసరం
ఉందన్నారు. మరిన్ని పరిశోధనలు జరిగితే మరింత ప్రోత్సాహకరమైన పరిస్థితులు నెలకొంటాయన్నారు. తాను సీఎంతో మాట్లాడి ఆయూష్ విభాగానికి మరిన్నినిధులు వచ్చేలా చేస్తామన్నారు.
ఈ సందర్భంగా ఆయుష్ కాలేజీల అంతర్గతంగా నిర్వహించిన పలుపోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందచేశారు. ఇదిలావుండగా, శనివారం జయసూర్య పొట్టిశ్రీరాములు హోమియో కళాశాల స్వర్ణోత్సవ సంబురాలను భారత
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే సాయంత్రపు సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొని విద్యార్థుల క్రీడాపోటీల విజేతలకు బహుమతులు అంచేశారు. ఈ కాలేజీ పూర్వ విద్యార్థులు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ కేంద్ర మంత్రి, జయసూర్య పొట్టిశ్రీరాములు హోమియో కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ వేణుగోపాల చారి, ఆయుష్ డైరెక్టర్, కమిషనర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లింగరాజు, జూపల్లి రామేశ్వరరావు తదితరులు ముందుండి ఈ కార్యక్రమాల విజయవంతానికి తీవ్రంగా శ్రమించారు.
ప్రభుత్వ రంగంలో ఏకైక హోమియో కాలేజీ కావడం, రామాంతపూర్ జయసూర్య పొట్టిశ్రీరాములు హోమియో మెడికల్ కాలేజీకి 50 ఏళ్ళు పూర్తవడం, ఇదే కాలేజీలో చదివిన విద్యార్థులు ఇదే కాలేజీలో అధ్యాపకులుగా, డాక్టర్లుగా సేవలు అందించి రిటైర్ అవడం జరుగుతున్నది. దీంతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం, తాజా
విద్యార్థుల భాగస్వామ్యం తోడవడంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంతా ఓ కుటుంబం కలిసి మెలిసి కార్యక్రమాలను ఒక పండుగ మాదిరిగా జరుపుకున్నారు. తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, మరెన్నో కొత్త జ్ఞాపకాలను మోసుకుని వెళ్ళారు.