
హైదరాబాద్; వారం రోజులుగా చిన్నారులను ఆనందడోలికల్లో ఓలలాడించిన, చిన్నారుల సినిమా పండగ, ’20 వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం మంగళవారం నాడు ముగిసింది. ఏడురోజుల పాటు హైదరాబాద్ నగరంలోని 13 థియేటర్లతో పాటు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని జిల్లా కేంద్రాలలో సందడి చేసిన ‘బంగారు ఏనుగు’ కు చిన్నారులు, బాలల పండగను అద్వితీయంగా, నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రచార శాఖ,చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ, ఇండియా, తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర చలన చిత్ర మండలి అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ‘నవ్య భారత్’ ప్రధాన విషయం ( థీమ్) గా సాగిన చిత్రోత్సవంలో వివిధ దేశాలనుంచి సినిమా రంగ ప్రముఖులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, నటులు, నిర్మాతలు, దర్శకులు, బాల నటులు ఇంకా ఎందరో విశేష వ్యక్తులు పాల్గొన్నారు. పెద్దలు పిల్లలకు మార్గ దర్శకత్వం చేస్తే, పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించి ‘శభాష్’ అనిపించుకున్నారు. వివిధ దేశాల నుంచి, వివిధ విభాగాలలో వినోదంతో పాటు విజ్ఞానాన్నిపంచిన సుమారు 300 చిత్రాలను ఈ వారం రోజుల్లో ప్రదర్శించారు. లక్షలాది మంది చిన్నారులు, తల్లి తండ్రులు ఈ చిత్రాలను చూసి ఆనందించారు. చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ, ఇండియా( సిఎఫ్ఎస్ఐ) చైర్మన్, ‘శక్తిమాన్’ ముఖేష్ ఖన్నా, సిఎఫ్ఎస్ఐ ప్రధాన కార్య నిర్వహణాధికారి (సిఈఓ) శ్రవణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి మండలి, చైర్మన్ రామ్మోహన్ ,పౌర సంబంధాల శాఖ కమిషనర్, రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ మిట్టల్ పర్యవేక్షణలో పిల్లల పండగ కన్నుల పండగగా సాగింది. ఒక మధురానుభూతిగా మిగిలి పోయింది.
కాగా, శిల్ప కళా వేదికలో కన్నుల పండుగగా జరిగిన బాలల చలన చిత్రోత్సవం ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను శాశ్వతంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించాలని, అందుకు సీఎఫ్ఎస్ఐ చైర్మన్ ముఖేష్ ఖన్నా, సిఈఓ శ్రవణ్ కుమార్ ను కోరారు. నేటితో ముగిసిన 20 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఎంతో స్పూర్తి దాయకంగా ఉందని అన్నారు. చిత్రోత్సవం లో భాగంగా తొలిసారిగా హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో చిత్రాలను ప్రదర్శించారని మంత్రి తెలిపారు. అదే విధంగా ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల ద్వారా చిన్నారులు అనేక విషయాలు తెలుసు కున్నారని అన్నారు.
ఈ తరం పిల్లలు అనేక విషయాల్లో ఎంతో ప్రతిభ చుపుతున్నారని అయితే తల్లి తండ్రులు ఒక్క చదవు మీదనే శ్రద్ధ పెట్టి, పిల్లలలో సృజనాత్మకతను అంతగా ప్రోత్సహించడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. తల్లి తండ్రులు పిల్లలను వారికి ఇష్టమైన రంగాలలో ప్రోత్సహిస్తే, వారు మరింత రాణిస్తారని అయన విశ్వాసాన్ని వ్యక్త పరిచారు.
ముగింపు వేడుకల ప్రారంభంలో సీఎఫ్ఎస్ఐ చైర్మన్ ముఖేష్ ఖన్నా మాట్లాడుతూ, ‘బంగారు ఏనుగు’ వేడుక వేడుకకు మరింత బలోపేతం అవుతోందని, బాలల చలన చిత్రోత్సవం పరిమాణంలోనే కాకుండా గుణాత్మకంగాను ముందడుగు వేస్తోందని అన్నారు. ఈసంవత్సరం 109 దేశాల నుంచి వివిధ విభాగాల్లో 1402 ఎంట్రీలు వచ్చాయని, అందులోంచి జ్యూరి ఎంపిక చేసిన 300 చిత్రాలను ప్రదర్శించడం జరిగిందని అన్నారు. ఇదొక పండుగగా ముఖేష్ ఖన్నా పేర్కొన్నారు. పిల్లలందరూ పిల్లల కోసం నిర్మించిన ప్రత్యేక చిత్రాలను చూసేందుకే ఇష్టపడతారని అంటూ, సాస్ బహు’ లాంటి సినిమాలు పిల్లలు చూడరాదని అన్నారు.
ఈ చిత్రోత్సవంలో వివిధ దేశాల నుంచి పాల్గొన్న ప్రతినిధుల నుంచి మనం ఎంతో నేర్చుకున్నామని, అలాగే,మన నుంచి వారు ఎంతోకొంత నేర్చుకున్నారని ముఖేష్ ఖన్నా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞతలు చెపుతూ, శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా, తెలంగాణ చిన్నారులంతా ‘శక్తి మాన్.కావాలని ఆకాంక్షించారు. బాలీవుడ్ నటి యామిని గౌతమ్, గాయని, నటీ శ్రద్ధా కపూర్ తెలుగు బాల నటుడు బాహు బలి’ లో నటించిన బాల నటుడు నిఖిల్ తదితరులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించారు. అదే విధంగా వివిధ విభాగాలలో ఉత్తమ చిత్రాలుగా ఎంపికైన చిత్రాలు, చిత్ర నిర్మాత దర్శకులకు జ్యూరీ చైర్ పర్సన్ అమల అక్కినేని, ఇతర సభ్యులు బహుమతులను అందచేశారు.
సీఎఫ్ఎస్ఐ సిఈఓ శ్రావణ్ కుమార్ ఈ ఏడు రోజులలో నిర్వహించిన కార్యక్రమాల విశేషాలను వివరించారు. రాష్ట్రచలన చిత్ర మండలి మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ మిట్టల్ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసిన అందరిని అభినందిచారు.