మీడియా విశ్వసనీయత కోల్పోకూడదు..

-సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు
-సామాజిక మాద్యమంపై చర్చ జరగాలి
-భారత పత్రికారంగ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో వక్తల ఉద్ఘాటన.
-త్వరలో మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా ఏర్పాటు
హైదరాబాద్ : ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాపై ప్రజలకు విశ్వాసం సడలకుండా ఉండేలా ప్రయత్నాలు జరగాల్సిన ఆవశ్యకత ఉందని సీనియర్ సంపాదకులు, ప్రెస్ అకాడమీ పూర్వ అధ్యక్షులు పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మాద్యమాల పై ప్రజలు విశ్వాసం కోల్పోవడమనేది ప్రమాదకరమని ఆయన అన్నారు. ప్రజల విశ్వసనీయత చూరగొనేలా సంబంధిత రంగాల ప్రముఖులు తగిన చర్యలు తీసుకోవడం మంచిదన్నారు.

విశ్రాంత ఉపాధ్యాయులు మాడభూషి కృష్ణ ప్రసాద్ రచించిన ‘భారత పత్రికారంగ చరిత్ర’ పుస్తకాన్ని శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పొత్తూరి ఆవిష్కరించారు. ఈ సభకు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు అధ్యక్షత వహించారు. జాతీయ పత్రికా దినోత్సవం, ఐజేయూ రజతోత్సవాలను పురస్కరించుకొని ఏపీయూడబ్ల్యూజే ఈ పుస్తకావిస్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు స్వాగతం పలికారు. యూనియన్ పూర్వ అధ్యక్షుడు బి. సోమసుందర్ రచయిత మాడభూషి కృష్ణ ప్రసాద్ ను పరిచయం చేశారు.

ఈ సభలో పొత్తూరి మాట్లాడుతూ సమాజంలోని అన్ని రంగాలను సామాజిక మాద్యమాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రవేశంతో ప్రింట్ మీడియా భవిష్యత్ ఏమవుతుందనే ఆందోళన వ్యక్తమైందని.. కానీ కేవలం రెండు శాతం మాత్రమే ప్రభావితం చేయగలిగిందన్నారు. అలాగే ఇంటర్నెట్ విస్తృతమైనప్పుడు కూడా ప్రింట్ మీడియాపై తీవ్ర ప్రభావమేదీ లేదన్నారు. కానీ సామాజిక మాద్యమం మాత్రం వాణిజ్య, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్నారు. ఈ భారత పత్రికరంగ చరిత్ర పుస్తకం జర్నలిస్టులంతా చదవదగినదన్నారు. తెలుగు భాషలో రాసిన రచయిన ప్రసాద్ ను అభినందించారు.

ఆంధ్రజ్యోతి సంపాదకులు కే.శ్రీనివాస్ మాట్లాడుతూ సూక్ష్మ చరిత్రలు రాసే కాలంలో స్థూల చరిత్రలు రాయడం విశేషమని.. పత్రికారంగ పరిణామ క్రమాన్ని రచయిత కృష్ణ ప్రసాద్ చక్కగా వివరించారని అన్నారు.

అనంతరం సీనియర్ సంపాదకులు ఐ. వెంకట్రావ్ మాట్లాడుతూ రచయితను అభినందించారు. కార్యక్రమంలో వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు జీఎస్ వరదాచారి, నవచేతన పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు ఎస్వీ సత్యనారాయణ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కే. అమర్ నాథ్, ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ తదితరులు హాజరై మాట్లాడారు.

పుస్తక రచనలో వెలుగు చూడడంలో తనకు సహకరించిన సోమసుందర్ తదితర మిత్రులకు రచయిత కృష్ణ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఐజేయూ జాతీయ నాయకులు నరేందర్ రెడ్డి వందన సమర్పణ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *