మినుముల కొనుగోలు కేంద్రాల ప్రారంభం

 

• 14 చోట్ల కొనుగోలు కేంద్రాలు.

• మద్దతు ధర కన్నా తక్కువకు రైతులు అమ్ముకోవద్దు.

• పత్తి రైతులకు గుర్తింపు కార్డులు.
___________________

తెలంగాణలో మినుముల కొనుగోలుకు  బుధవారం 14 ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అను గుణంగా కొనుగోలు కేంద్రాలను  మినుములు తీసుకు రావాలని మంత్రి కోరారు.పెసర్లు, మినుములు, పత్తి తదితర  పంటల దిగుబడి, మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న ధర , రైతులను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై  మంగళవారం నాడు  వ్యసాయ మార్కెటింగ్ అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఈ ఖరీఫ్ లో 6680 టన్నుల మినుములను కొనుగోలు చేసేందుకు  వెంటనే నాఫేడ్ తరపున మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని హరీష్రావు ఆదేశించారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో క్వింటాలు మినుములు ధర  2,500 రూపాయల నుంచి  4615 రూపాయలు మాత్రమె రైతులకు లభిస్తున్నట్టు మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మినుములకు మద్దతు ధర ను సాధారణంగా అక్టోబర్ 1 న ప్రకటిస్తుందని తమ విజ్ఞప్తి కి సానుకూలంగా స్పందించి తక్షణం షెడ్యూలు తేదీలకు మినహాయింపు ఇచ్చిందని హరీశ్ రావు తెలిపారు. క్వింటాలు మినుములకు 5400 రూపాయలు మద్దతు ధర ఉన్నందున అంతకన్నా తక్కువ ధరకు రైతులెవరూ తొందరపడి అమ్ముకోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్, జుక్కల్, బిచ్కుంద,పిట్లం, నిజామాబాద్ జిల్లాలో బోధన్, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, నారాయణ ఖేడ్ , వట్పల్లి,  నిర్మల్ జిల్లాలో కుబెర్, భైంసా,జైనూర్ , ముధోల్,వికారాబాద్ జిల్లా తాండూర్, వికారాబాద్ వ్యవసాయ మార్కేట్ కమిటీలు, డి. సి.ఎం.ఎస్ లలో మినుముల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మార్క్ ఫెడ్ అధికార యంత్రాంగాన్ని హరీష్ రావు ఆదేశించారు. పెసర్ల లాగే మినుములకు కూడా మద్దతు ధరను షెడ్యూలు కన్నా ముందే రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పెసర్ల కొనుగోలు విషయం లో కేంద్ర ప్రభుత్వం, నాఫెడ్ విధించిన నాణ్యతా ప్రమాణాలను సడలించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖను ప్రత్యెక మెసెంజర్ ద్వారా ధిల్లీకి సోమవారమే పంపినట్టు హరీశ్ రావు తెలియజేశారు. పత్తి ఖరీఫ్ మార్కెటింగ్ సీజను ముగిసే వరకు జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్ రావు కోరారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసుకొని పరిస్థితిని సమీక్షించాలని ఆయన సూచించారు. పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో తీసుకొనవలసిన జాగ్రత్తలు, ఏర్పాట్లను మార్కెటింగ్ మంత్రి మంగళవారం సమీక్షించారు. ఖరీఫ్ లో ఏ ప్రాంతాల్లో ఎంత పత్తి పండించారో సమగ్ర డాటాను పంపించాలని హరీష్ రావు జిల్లా కలెక్టర్లను కోరారు. ఈ ప్రక్రియ అక్టోబర్ 5 వ తేదీ కల్లా పూర్తి చేయాలని ఆయన కోరారు. చరిత్రలో  మునుపు ఎన్నడు లేని విధముగా తెలంగాణలో పత్తి పండిస్తున్నందున, దానికి తగ్గట్టుగా కొనుగోలు ఏర్పాట్ల కోసం గత జూన్ నుంచే ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్టు హరీష్ రావు తెలిపారు. ఈ సంవత్సరం పత్తి కొనుగోలు కేంద్రాలను 143కు పెంచడానికి కేంద్రం సుముఖత చూపిందన్నారు. జినింగ్ మిల్స్ ను కూడ అవసరమైన మేరకు కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై  చేయవలసినదిగా   మంత్రి హరీశ్ రావు కోరారు.పత్తి రైతులు ఎటువంటి అందోళన చెందకుండా మార్కెట్లో అమ్ముకునేలా ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. మద్దతు ధర తగ్గిన వెంటనే కాటన్ కార్పొరేషన్ పత్తి కొనుగోలు కు ఏర్పాట్లు చేస్తున్నట్లు  మార్కెటింగ్ మంత్రి తెలిపారు. పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఆయా జిల్లా కలెక్టర్లు జారీ చేయాలని  మంత్రి కోరారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ  ప్రతిపాదించిన 143 పత్తి కొనుగోలు  కేంద్రాల‌కు గాను గ‌తంలోని 84 మార్కెట్ క‌మిటీ కొనుగోలు కేంద్ర‌ముల‌కు అదనముగా జిన్నింగు మిల్లులువున్న ప్రాంతాలలో 27 అదనపు కేంద్రాలకు సి.సి.ఐ అంగికరించినట్టు ఆయన తెలిపారు. మొత్త‌ము 111 కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తారు. సి.సి.ఐ, వ్యవసాయ మార్కెట్ కమిటిల నుంచి తగిన ప్రతిపాదనలు తీసుకొని, 84 మార్కెట్ క‌మిటీ కొనుగోలు కేంద్ర‌ముల‌లో కూడా, అవసరాల మేరకు జిన్నింగు మిల్లులను నోటిఫై చేయాలని  హరీశ్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దీనితో మొత్త‌ము కేంద్రాల సంఖ్య ప్ర‌తిపాదిత 143 కంటే  పెరిగే అవ‌కాశ‌ము ఉంద‌ని తెలిపినారు. పత్తి అమ్మిన వెంటనే 48 నుంచి 72 గంటలలోపు రైతుల  ఖాతాకు నేరుగా చెల్లింపులు జరిగేలా జిల్లా కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.గతంలో మాదిరి కాకుండా అన్ని కొనుగోలు కేంద్రాలు, వారంలో 6 రోజులు పూర్తి స్థాయిలో పనిచేయాలని మంత్రులు కోరారు.పత్తి క్రయ, విక్రయాలు జరిగిన తర్వాత ప్రాసెసింగ్ కోసం అద్దెకు తీసుకోవలసిన జిన్నింగ్ మిల్లుల‌తో ఒప్పందపు ప్రక్రియను ఈ రోజే పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు కాటన్ కార్పోరేషన్ అధికారులను కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *