మార్తాండ తేజా శాంతించు..

డియర్ సూర్య,
ప్రేమగా సంబోధిస్తున్నామే గానీ నిజానికి మంట మీదున్నాం. ఏంటీ స్వామీ ఈ నిప్పుల వాన? విశ్వరూపం అంటే ఇదేనా భగవాన్? శివుడిలా మూడో కన్ను తెరిచావా ఏంటి సూర్యా? మానవ మాత్రులం దేవా! తూరుపు కొండల మీద లేలేత కిరణాలతో పైకి తేలే టైంలోనే నిన్ను చూడలేకపోతున్నాం తండ్రీ! సూర్య నమస్కారం చేసే టైంలోనే సుర్రుమంటున్నావ్.. ఈ సకల చరాచర జీవరాశి మనుగడ అంతా నీ చలవే. నీవే మాకు దిక్కూ మొక్కూ. కానీ ఏంటి స్వామీ ఈ వైపరీత్యం? ఈ యాభై ఏళ్లలో నిన్ను ఇలా చూడలేదు స్వామీ. చండప్రచండగా అగ్గిరవ్వలు చెరుగుతున్నావేంటి తండ్రీ! ఏడింటికే నలుదిక్కులా సెగలు కక్కుతున్నావు కదా దేవా. పగలంతా అగ్గి కురిపిస్తున్నావు. మనుషులపై నిజంగానే యుద్ధమేదైనా ప్రకటించావా? తండ్రీ.. నీ కోపాగ్నిని తట్టుకోలేకపోతున్నాం. నీ ఆగ్రహం అగ్ని ఖడ్గమై ఉసురుతీస్తోంది. మాంసం ముద్దల్లా ఉడికిపోతున్నాం. నీ ప్రకోపానికి కారణమేంటి? ఎందుకీ అగ్నిపరీక్ష. కాసేపు మబ్బుల మాటుకి వెళ్తే చచ్చిబతుకున్నాం. కాసిన్ని చినుకులకే ముఖం వాచిపోయాం. పండు వెన్నెల మండు వెన్నెలైంది. చల్లటి రాత్రి గతమైపోయింది. పగలంతా మాడిపోతున్నాం. రాత్రంతా ఉడికిపోతున్నాం. హాఫ్ బాయిల్డ్ బతుకై పోయింది. ఎండాకాలం డాబా మీద నిద్రపోయినా సుఖం లేదు. కూలర్లు, ఏసీల్లేని పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి? మా ఖర్మ కాకపోతే గాలీ, నీరూ కూడా నీకు తోడవ్వాలా? నీ చండ ప్రచండ వేడిగాలులకు పిల్లాజెల్లా శలభాల్లా మారిపోతున్నారు స్వామీ.

అయినా, నిన్ను అని ఏం లాభంలే సూర్యా? ఆలోచిస్తే, ఇదంతా మా స్వయంకృతాపరాధమే. మా స్వార్థం కోసం కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాం. నీడనిచ్చే చెట్లను పెకిలించాం. అడవుల్ని అంతం చేశాం. ఒకరకంగా చెప్పాలంటే ప్రకృతినే చెరబట్టాం. ఇప్పుడా చెరలోనే బందీలైపోయాం. బండి లేకపోతే రోడ్డెక్కలేకపోతున్నాం. కాలుష్యంలోనే కాలం వెళ్లదీస్తున్నాం. మూలాలు మర్చిపోయి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం. ఇదే గొప్ప అన్న భ్రమలో బతికేస్తున్నాం. కానీ భవిష్యత్ తరాలను బలిపీఠం ఎక్కిస్తున్నామని తెలుసుకోలేకపోతున్నాం. అందుకే మా తప్పు మేం తెలుసుకున్నాం. మారిపోతాం. కచ్చితంగా మారిపోతాం. ఇంటికో మొక్క నాటుతాం. కరెంటు వాడకాన్ని తగ్గిస్తాం. ఏసీలు, కూలర్ల వెంట వెర్రిగా పరుగులు పెట్టం. ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తాం. భూతాపాన్ని చల్లారుస్తాం. వర్షపు నీటిని ఒడిసి పడతాం. హరితహారం, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు అలాంటివే. అడవులను పెంచుతాం. అడుగంటిన పాతాళ గంగను పైకి తెస్తాం. ఈ ఐదేళ్లలో తెలంగాణ పచ్చపడేలా చేస్తాం. మార్తాండ తేజా శాంతించు. మాకు సంకల్ప బలమివ్వు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *