మార్చి 15న శ్రీకళాసుధ ఉగాది పురస్కారాలు

చెన్నైలోని శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్‌ గత 16 సంవత్సరాలుగా సినీరంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులను ఘనంగా సత్కరిస్తూ వారికి అవార్డు ప్రదానం చేయడం అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తోంది. 1998 నవంబర్‌ 21న ప్రారంభించిన ఈ సంస్థ ఈ సంవత్సరంలో 17వ వసంతంలోకి అడుగిడుతోంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉగాది పురస్కారాలను అందిస్తోంది శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్‌. మార్చి 15 సాయంత్రం 4 గంటల 23 నిముషాలకు చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీలో పంచాంగ పఠనంతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు అతిథులుగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమ విశేషాలను తెలిపేందుకు మార్చి 7న హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బేతిరెడ్డి శ్రీనివాస్‌, కార్యదర్శి మల్లినేని అమరేందర్‌, నటుడు కాశీవిశ్వనాథ్‌, మిమిక్రీ కళాకారుడు వి.హరికిషన్‌, వేణు పాల్గొన్నారు.బేతిరెడ్డి శ్రీనివాస్‌: 17 సంవత్సరాలుగా మా శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్‌ ఎన్నో కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా నిర్వహించింది. ప్రతి సంవత్సరం మా సంస్థ ఇచ్చే అవార్డులను ఉగాది పండుగకు ముందు వచ్చే ఆదివారం రోజున నిర్వహించే కార్యక్రమంలో ప్రదానం చేయడం జరుగుతోంది. ఈ సంవత్సరం మార్చి 15న అవార్డుల ప్రదానం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖమంత్రి గంటా శ్రీనివాసరావుగారు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌గారు సభకు అధ్యక్షత వహిస్తారు. ప్రముఖ నేపథ్యగాయకులు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంగారు విశిష్ట అతిథిగా హాజరవుతారు. వీరితోపాటు వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ వేడుకలో ముందుగా అశ్వినిశాస్త్రి, రోహిణి శాస్త్రిగార్లచే పంచాంగ పఠనం జరుగుతుంది. అనంతరం యం.యం.శ్రీలేఖగారు ప్రార్థనా గీతం ఆలపిస్తారు. రాజమండ్రికి చెందిన లలిత సింధూరిగారు చేసే కూచిపూడి నృత్యం వుంటుంది. యం.యం.శ్రీలేఖగారు, దర్భ మృదురవళిగారు బాపుగారి చిత్రాల్లోని పాటలను పాడి ఆహూతులను అలరిస్తారు. ఈ కార్యక్రమాన్ని బాపుగారి మనవరాలు జి.భార్గవి నిర్వహిస్తారు. ఈ వేడుకలో 2014 సంవత్సరంలో రిలీజ్‌ అయిన సినిమాల తాలూకు 24 క్రాఫ్టులకు సంబంధించిన 24 మందికి అవార్డులను అందించబోతున్నాం. అలాగే అవతారపురుష ‘బాపు’ పురస్కారాలు పేరిట బాపుగారి సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన జయప్రదగారికి, స్నేహగారికి ‘బాపు బొమ్మ’ అవార్డులను ప్రదానం చేస్తున్నాం. వీరికి వెండి కిరీట ధారణ జరుగుతుంది. ఆరోజు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘మహిళా రత్న’ పురస్కారాలను సంగీత విద్వాంసులు ద్వారం మంగతాయారుగారికి, విద్యారంగానికి చెందిన డా॥ జయ వేణుగోపాల్‌గారికి అందించబోతున్నాం.కాశీ విశ్వనాథ్‌: చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది శారీరకంగా చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చేసినప్పటికీ మానసికంగా అక్కడ వారి జీవితాల్లోని కష్టాలు, సుఖాలు, సంతోషాలు, అనుభూతులు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు వారికి ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం వేదిక కానుంది. గత 17 సంవత్సరాలుగా శ్రీనివాస్‌గారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను.

వి.హరికిషన్‌: బాపుగారు ఎంతో గొప్ప గొప్ప సినిమాలు మనకు అందించారు. ఆయన పేరు మీద బాపుబొమ్మ పేరుతో హీరోయిన్లకు పురస్కారాలు అందించడం ఎంతో సంతోషంగా వుంది. గతంలో చెన్నైలో కళాసాగర్‌ అనే సంస్థ ఈ తరహాలో అవార్డులు అందించేది. 17 సంవత్సరాల తర్వాత ఆ సంస్థను మూసివేయడం జరిగింది. సరిగ్గా ఆ టైమ్‌లోనే శ్రీనివాస్‌గారు శ్రీకళాసుధ సంస్థను ప్రారంభించారు. నేను కళాసాగర్‌లో అవార్డు తీసుకున్నాను. అయితే శ్రీకళాసుధలో మాత్రం 17 సంవత్సరాల తర్వాత నాకు అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమంలో నేను ఓ కొత్త ధ్వన్యనుకరణ చేయబోతున్నాను. ఇంతవరకు ఎక్కడా ప్రదర్శించని ఓ అంశాన్ని ఈ కార్యక్రమంలో ప్రదర్శించబోతున్నాను.

మల్లినేని అమరేందర్‌: ప్రతి సంవత్సరం మా సంస్థ ఇచ్చే పురస్కారాలు స్వచ్ఛమైన వెండితో చేయించినవి. ఒక మంచి ఉద్ధేశంతో, ఎలాంటి లాభాపేక్ష లేకుండా శ్రీనివాస్‌గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మేమంతా వివిధ వ్యాపారాలలో వున్నప్పటికీ వాటన్నింటినీ పక్కనపెట్టి ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం.

17వ ఉగాది పురస్కార గ్రహీతలు

ఉత్తమ నటుడు: నందమూరి బాలకృష్ణ(లెజెండ్‌)

ఉత్తమనటి: శ్రీయ(మనం)

ఉత్తమ సహాయ నటుడు: వై.కాశీవిశ్వనాథ్‌

ఉత్తమ సహాయ నటి: ప్రగతి మహావది

ఉత్తమ నూతన నటుడు: వరుణ్‌తేజ్‌(ముకుంద)

ఉత్తమ నూతన నటి: రాశిఖన్నా(ఊహలు గుసగుసలాడే)

ఉత్తమ నూతన నటి: పూజా హెగ్డే(ఒక లైలా కోసం, ముకుంద)

స్పెషల్‌ జ్యూరీ అవార్డు: అజయ్‌(దిక్కులు చూడకు రామయ్య)

స్పెషల్‌ జ్యూరీ అవార్డు: కార్తీక(బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి)

ఉత్తమ కథా చిత్రం: మనం(అక్కినేని కుటుంబం)

ఉత్తమ సంచలన చిత్రం: రేసుగుర్రం(నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), డా॥ కె.వెంకటేశ్వరరావు

ఉత్తమ నిర్మాత: సాయి కొర్రపాటి(లెజెండ్‌, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య)

ఉత్తమ స్క్రీన్‌ప్లే: బి.సుకుమార్‌(‘1’ నేనొక్కడినే)

ఉత్తమ ఛాయాగ్రాహకుడు(వి.ఎస్‌.ఆర్‌.స్వామి అవార్డు): ఆర్‌.రత్నవేలు

ఉత్తమ సంగీత దర్శకుడు: అనూప్‌ రూబెన్స్‌(మనం)

ఉత్తమ నేపథ్య గాయకుడు: గోల్డీ దేవరాజ్‌(అనగా అనగనగా అమ్మాయి..రన్‌ రాజా రన్‌)

ఉత్తమ నేపథ్య గాయని: చిన్మయి శ్రీపాద(పదహారేనైనా..కరెంటు తీగ)

ఉత్తమ నూతన దర్శకుడు: అవసరాల శ్రీనివాస్‌(ఊహలు గుసగుసలాడే)

ఉత్తమ బాలనటుడు: మాస్టర్‌ గౌతమ్‌కృష్ణ(‘1’ నేనొక్కడినే)

అవతారపురుష ‘బాపు’ పురస్కారాలు – బాపు బొమ్మ:  జయప్రద, సేహ

మహిళారత్న పురస్కారాలు: ద్వారం మంగతాయారు(సంగీత విద్వాంసురాలు), డా॥జయ వేణుగోపాల్‌(విద్యారంగం)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *