
కరీంనగర్ (పిఎఫ్ ప్రతినిధి): మారుమూల ప్రాంతాలకు సైతం సత్వర వైద్య సేవలు అందించేలా అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ర్ట ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య విధాన పరిషత్, ప్రభుత్వ వైద్యశాల మహాదేవ్ పూర్ కు కేటాయించిన అంబులెన్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాదేవ్ పూర్ మండల పరిధిలోని కాటారం, మహాముత్తారం, మలహార్, మహాదేవ్ పూర్ ప్రజలకు ఈ అంబులెన్స్ ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, కరీంనగర్, మంథని, కోరుట్ల, రామగుండం, హుస్నాబాద్ శాసన సభ సభ్యులు గంగుల కమలాకర్, పుట్ట మధు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సోమారపు సత్యనారాయణ, దాసరి మనోహర్ రెడ్డి, ఓడితాల సతీష్, నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.