
కరీంనగర్: కవి, రచయిత, వ్యాఖ్యాత మాడిశెట్టి గోపాల్ వివిధ రంగాలలో ప్రశంసనీయమైన సేవలు అందిస్తున్నారని సినారె పురస్కార కమిటీ కన్వీనర్ ప్రముఖ పిల్లల వైద్యులు డా. ఎడవల్లి విజయేందర్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక భగవతి పాఠశాలలో సమైక్య సాహితి ఆద్వర్యం లో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూంపల్లి విజయ సాహితీ పురస్కారాన్ని 2016 సంవత్సరానికి గాను మాడిశెట్టి గోపాల్ కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యం సమాజాన్ని సన్మార్గం లో నడిపిస్తుందన్నారు.. అలాంటి సాహితీ కళా రంగాలను ఎంచుకొని ఆ రంగాలలో విశేష కృషి చేసిన గోపాల్ ఈ పురస్కారానికి అర్హులని తెలిపారు. కఫిసో ప్రధాన కార్యదర్శిగా, సమైక్యసాహితీ అధ్యక్షులుగా, కరీంనగర్ ఎన్నారై ఫోరం సమన్వయకర్త గా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, పలు నాటకాలలో నటించడమే కాకుండా మనసు పొరల్లో డాక్యుమెంటరీ ఫిలింలో, మార్గదర్శి సినిమాలలో నటించారని ప్రశంసించారు. సాహితీ గౌతమి అధ్యక్షులుగా అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. విశిష్ట అతిథిగా హాజరయిన డీ పి ఆర్ ఓ ప్రసాద్ మాట్లాడుతూ మాడిశెట్టి స్థానిక సిటీకేబుల్ లో న్యూస్ రీడర్ గానే కాకుండా పలు కార్యక్రమాలు నిర్వహించారని, పురాతన వ్రాత ప్రతుల జిల్లా కో ఆర్డినేటర్ గా, జిల్లా అధికారభాషా సంఘ సభ్యునిగా, వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారని అన్నారు. సింగపూర్ , మలేషియాలలో ఉగాది ఉత్సవాలలో వ్యాఖ్యానం చేయడం ఆయన ప్రతిభకు నిదర్శనమని, ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య, ఘనతంత్ర దినోత్సవాలలో మాడిశెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండడమే కాకుండా, పలు పురస్కారాలు, సన్మానాలు, బిరుదులు పొందారని ప్రశంసించారు. ఆత్మీయ అతిథిగా హాజరైన బహుభాషా వేత్త డా. నలిమెల భాస్కర్ మాట్లాడుతూ పురస్కార గ్రహీత మాడిశేట్టి గోపాల్ చెలిమి చెలిమెలు పుస్తకాన్ని వెలువరించారని , పలు పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారని తెలిపారు . ఇటీవల జగిత్యాలలో అలిశెట్టి పురస్కారాన్ని, సిద్దిపేటలో తడకమడ్ల పురస్కారాన్ని, నల్గొండ వారి తేజ ఆర్ట్స్ పురస్కారాన్ని, రాష్ట్ర ఆవిర్భావ విజయోత్సవల సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ వ్యాఖ్యాత పురస్కారాన్ని కూడా అందుకున్నారని అన్నారు. భవిష్యత్తులో గొప్ప రచనలు చేయాల్సిందిగా సూచించారు.
సాహితిగౌతమి అధ్యక్షుడు కె.యస్.అనంతాచార్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో పురస్కార కమిటీ కన్వీనర్ భూంపల్లి నారాయణ రెడ్డి, సభ్యులు అన్నవరం దేవేందర్, తుమ్మల రమెశ్ రెడ్డి, , కార్యదర్శి దాస్యం సేనాధిపతి, డా.బివిఎన్ స్వామి, బి. మధుసూదన్ రెడ్డి, కాఫిసో అధ్యక్షులు వరాల మహేశ్, రాగమంజరి వాల భద్రా రావు, భగవతి రామణారావు, తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాడిశెట్టి ని కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ గుండేటి రాజు, చైతన్య కళాభరతి సభ్యులు, కాఫీసో, గురజాడ ఫౌండేషన్, సేవ మార్గ్, మానేర్ పర్యావరణ సమితి, సాహితీ గౌతమి, తదితర సంస్థల పక్షాన ఆయా సంస్థల ప్రతినిధులు ఘనంగా మడిశెట్టి ని సన్మానించారు. ఈ సందర్భంగా మాడిశెట్టి మాట్లాడుతూ తాను చదువుకుంటున్న రోజులనుండే గురువుల ద్వారా పొందిన స్ఫూర్తి తన్ను సాహిత్యం, కళల వైపు మళ్లించిందని అన్నారు. వివిధ సంస్థల ద్వారా సమాజ హితమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంతృప్తి లభిస్తుందని ఇలాంటి పురస్కారాలు మరింత సాహితీ సేవ చేయడానికి స్ఫూర్తి కలిగిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా పురస్కారం కింద 3000/- రూ.ల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమం లో కవులు, రచయితలు, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.