మహిళా సర్పంచ్ పై కుల వివక్ష

హైదరాబాద్ , ప్రతినిధి ‌: నగరానికి సమీపంలోని మణికొండ పక్కనే ఉన్న పుప్పాలగూడలో కులరక్కసి బుసలుకొడుతోంది. ఈ గ్రామానికి తొలిసారిగా సర్పంచ్ గా ఎన్నికైన దళితమహిళ వర్ణ వివక్షకు గురై ఆవేదన చెందుతోంది. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న ఈ పంచాయితీ సర్పంచ్‌ పదవిని స్వతంత్రానంతరం మొదటిసారిగా దళిత మహిళకు కేటాయించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా సమావేశమై ఏకగ్రీవంగా సునీత అనే దళిత మహిళను గ్రామ సర్పంచ్ గా ఎన్నుకున్నారు.

ఏప్రిల్ లో ఏకగ్రీవ ఎన్నిక
గత ఏడాది ఏప్రిల్‌లో సర్పంచ్‌గా ఎన్నికైనా నెల వరకు ఆమెకు అధికారులు ఉత్తర్వులు అందచేయలేదు. కాళ్లరిగేలా తిరిగిన తరువాత ఎట్టకేలకు అధికారులు ఆమెకు సర్పంచ్‌గా ఎన్నికైనట్లు ఉత్తర్వులు అందించారు. ఇక గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని భావించిన ఆమెను కులరక్కసి కాటేసింది. మొదటిసారిగా జరిగిన పంచాయితీ బోర్డు సమావేశంలోనే ఇతర కులాలకు చెందిన ప్రముఖుల రాజకీయం ముందు ఆమె మాటలు చెల్లుబాటు కాలేదు. దళిత మహిళ కావడంతో అధికారులు పట్టించుకోవడం మానేశారని గ్రామస్తులంటున్నారు.

కులం పేరుతో దూషణలు
గ్రామ ప్రజలకు కనీస సౌకర్యాలు అందించాలని తపన పడ్డ ఆమెకు కులం పేరుతో దూషణలు ఎదురయ్యాయి. గ్రామంలో అక్రమ కట్టడాలను నిరోధించి పంచాయితీకి ఆదాయాన్ని పెంచాలని ఆమె చేసిన సూచనలు పట్టించుకునే వారు కరువయ్యారు. బహుళ అంతస్తుల నిర్మాణంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నా ఆమె తన అధికారాలు ఉపయోగించుకోలేని దుస్థితి ఆమెది.

విచారణ జరిపినా చర్యలు లేవు
ఈ విషయంపై జిల్లా పంచాయితీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. విచారణ నిర్వహించారని అయితే చర్యలు మాత్రం తీసుకోవడం లేదని ఆమె ఆవేదన చెందుతోంది. మాజీ సర్పంచ్ అధికారులతో కుమ్మక్కై నిబంధనలు విరుధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.