
ఢిల్లీ, ప్రతినిధి : ఢిల్లీలో పట్టపగలు ఓ మహిళా డాక్టర్‌పై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనలో డాక్టర్‌తోపాటు పక్కనేవున్న మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత మహిళలను వెంటనే ఎయిమ్స్‌కు తరలించారు. యాసిడ్ పడడంతో వైద్యురాలి ముఖం కుడివైపు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి ఘటన మార్కెట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
ఈఎస్ఐ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అమ్రితాకౌర్కి మ్యారేజ్ జరిగి 8 నెలలు అవుతోంది. డాక్టర్ ఫ్యామిలీ రాజోరి గార్డెన్ సమీపంలో నివాసముంటోంది. మంగళవారం ఉదయం టూ వీలర్‌పై వెళ్తుండగా మోటార్ బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు… ఆమెపై యాసిడ్ దాడి చేసి, హ్యాండ్ బ్యాగ్ దొంగిలించారు. ఆమె పనిచేసే ఈఎస్ఐ ఆసుపత్రికి కొద్దిదూరంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దాడి జరిపిన సమయంలో దుండగులు హెల్మెట్ ధరించడం వల్ల వారిని గుర్తించడంలో ఆలస్యమవుతోందని అంటున్నారు. మరోవైపు యాసిడ్ దాడికి పాల్పడిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని ఆమ్ఆద్మీపార్టీ డిమాండ్ చేసింది.