
మహబూబ్ నగర్ : జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. పాలమూరులోని మోతీనగర్‌కు చెందిన ఓ వ్యక్తికి స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడటంతో ఆస్పత్రిలో చేర్పించారు. రోగికి ప్రత్యేక వార్డులో వైద్యం అందిస్తున్నారు. మోతీనగర్ కు చెందిన వ్యక్తి ఇటీవలే తిరుపతి వెళ్లి వచ్చాడు. తరచూ జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో అనుమానం వచ్చిన వైద్యులు స్వైన్ ఫ్లూ పరీక్షలు నిర్వహించారు.
ఎన్1 హెచ్1 వైరస్ సోకినట్లు గుర్తించిన వైద్యులు అప్రమత్తమై వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను కూడా జాగ్రత్తలు తీసుకోమని వైద్యులు సూచించారు. ఈ సీజన్‌లో తొలి స్వైన్ ఫ్లూ కేసు జిల్లాలో నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కాలనీ వాసులకు అధికారులు సూచించారు. గతంలో దౌల్తాబాద్ మండలం బంగ్లా తండాకు చెందిన ఓ వ్యక్తికి సైన్ ఫ్లూ సోకినట్లు తెలిసింది.