
-పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
నాలుగున్నరేళ్లలో ప్రజలే బలం, అభివృద్ధే ధ్యేయంగా పని చేశానని, మరోసారి ఆశీర్వదిస్తే పాలకుర్తి రుణం తీర్చుకుంటానని పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళహారతులు, కోలాటం, ఆటపాటలు, బోనాలు, బతుకమ్మలు, డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోళ్లతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించామన్నారు. గిరిజనుల ఆకాంక్ష తెలుసుకొని తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతీ ఎకరాకు సాగునీరందిస్తామన్నారు. చంద్రబాబును భుజాలపై ఎత్తుకొని తీసుకొస్తున్న కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. అలాంటి వారిని చిత్తుగా ఓడించాలన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలతో రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు, ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు నల్ల నాగిరెడ్డి, మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.