మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు : తలసాని శ్రీనివాస్ యాదవ్

 

భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, కులవృత్తులపై ఆధారపడి జీవించే వారిని ప్రధానంగా మత్స్యకారుల జీవితంలో వెలుగులు నింపి వారిని సామాజికంగా,ఆర్ధికంగా వృద్ధిలోకి తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మత్స్య,పాడి పరిశ్రమ అభివృద్ధి , సినిమాటోగ్రఫి మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

గురువారం సచివాలయంలో మత్స్యశాఖ అధికారులు,మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించడానికి అన్ని విధాల వారికి సహాయ సహకారాలందిస్తామన్నారు. రాబోవు కాలంలో తెలంగాణ రాష్ట్రం కులవృత్తుల ప్రోత్సహాంలో భారత దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి అవసరమైన చేపల పెంపకం, మార్కెటింగ్ వంటి వాటిపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ అవగాహన సదస్సులు ఫిబ్రవరి చివరి నుండి మార్చి మొదటి వారంలో ఏర్పాటుకు అన్నిచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు.  మత్స్యకారుల అభివృద్ధికై చేపట్టే కార్యచరణను ముందుగానే రూపొందించుకోవాలని, మత్స్యశాఖ అధికారులతో పాటు సహకార సంఘాలకు ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అనేక లక్షల మంది అభ్యున్నతి అని అన్నారు. ఇతర దేశాలకు నాణ్యమైన చేపల ఎగుమతికి కృషి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

చేపల విక్రయానికి అవసరమైన మార్కెట్ల నిర్మాణానికి, మత్స్య సహకార సొసైటీలలో సభ్యులుగా ఉన్న వారికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు.నూతన మార్కేట్ల నిర్మాణానికి అవసరమైన స్ధల సేకరణకు మత్స్యశాఖ అధికారులు, సొసైటీ సభ్యులు కృషి చేయాలన్నారు. ఈ బడ్జెట్ లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల అభివృద్ధి,చేపల చెరువుల నిర్మాణం,చేపల చెరువుల నిర్వహణకు సబ్సిడీ, చేపపిల్లలను పెంచే యూనిట్లకు అందించేలా ప్రతిపాదించడం జరుగుతుందన్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ చందా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సరళాదేవి, జాయింట్ డైరెక్టర్ శ్రీ శంకర్ రాధోడ్ తదితరులు పాల్గొన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *