
టోక్యో , ప్రతినిధి : ఎప్పుడు లేని విధంగా ఈసారి చలికాలం బీభత్సం సృష్టిస్తోంది. అన్ని దేశాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా మంచు తుపాన్ జపాన్ దేశాన్ని కప్పేసింది. విపరీతమైన చలిగాలులు, మంచు తుపాన్ బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజలు ఇళ్లలోనే బంధీ అయ్యారు. జనజీవనం స్తంభించింది. రికార్డ్ స్థాయిలో మంచుకురుస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. మంచు కారణంగా దేశంలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు తెలిసింది. చనిపోయినవారిలో 79 ఏళ్ల వృద్ధుడు… మంచును శుభ్రం చేస్తున్న మరో యువకుడు ఉన్నారు. శీతాకాలంలో ఏర్పడే మంచు తుపానుతో ఇక్కడ వాతావరణంలో భారీ మార్పులు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.
స్తంభించిపోయిన ప్రజా రవాణ వ్యవస్థ…
భారీ హిమపాతం కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రోడ్లపై ఎక్కడికక్కడ మంచు పేరుకుపోయింది. దీంతో చాలా ప్రదేశాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల రోడ్లపై వాహనాలు పట్టుతప్పి పడిపోతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా ప్రకటించింది.
విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం….
ఇక దేశీయ, విదేశీ విమానాల రాకపోకలు నిలిపివేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. గాలులు వేగంగా వీస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని చెబుతోంది. సిబ్బంది ఎప్పటికప్పుడు రోడ్లపై మంచును తొలగిస్తున్నప్పటికీ ఏకథాటిగా కురుస్తుండడంతో పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడంలేదు.