
న్యూఢిల్లీ , ప్రతినిధి : ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్, రష్యాల మధ్య రక్షణ, అణు ఇంధనం, చమురు, సహజవాయువు, మెడికల్ రిసెర్చ్, సైనిక శిక్షణ, మౌళిక వసతులు తదితర 16 కీలక అంశాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. రక్షణ విషయంలో భారత దేశానికి రష్యా పెట్టని కోటలా ఎప్పుడూ అండగా ఉంటోందని ఈ సందర్భంగా మోడీ కొనియాడారు.
భారత్‌లో రష్యా కంపెనీల పెట్టుబడులు..
ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంతో రక్షణ, ఇంధన, ఆర్థిక రంగాల్లో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని రష్యా పేర్కొంది. భారత్‌లో రక్షణ పరికరాల తయారీకి, హెలికాఫ్టర్ల నిర్మాణానికి రష్యా పూర్తి సహకారం అందించనుంది. కుడంకుళం అణువిద్యుత్ కర్మాగారం భారత్ రష్యా సంబంధాలకు ప్రతీకగా రష్యా అభివర్ణించింది. కుడన్కుళంలో రెండో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డిజైన్ చేయడానికి అంగీకరించింది. భారత్‌లో 10 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. అంతరిక్ష పరిశోధనలో భారత్‌కు పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది. మోడి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్‌లో పెట్టుబడులకు రష్యా కంపెనీలను ప్రోత్సహిస్తామని పుతిన్ పేర్కొన్నారు. భారత్, రష్యాలు సహజ మిత్రులని పుతిన్ అభివర్ణించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ భారత పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి. ప్రపంచంలోని చాలా దేశాలతో భారత్‌కు సంబంధాలున్నప్పటికీ ఆపదలో ఆదుకునే దేశం మాత్రం రష్యా ఒక్కటే. రష్యాతో అనుబంధం భారత్‌కు రక్షణ కవచం లాంటిది.