
కరీంనగర్, ప్రతినిధి : బోదకాలు భారమైంది.. చివరకు ప్రాణాలకే ముప్పుతెచ్చింది. భరించలేని 70 కిలోల బరువుతో కదల్లేకుండా చేసింది. అన్ని ఆస్పత్రులు తిరిగినా చికిత్స సాధ్యం కాలేదు. చివరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీసాయి లైఫ్ లైన్ ఆస్పత్రి వైద్యులు మహిళకు అరుదైన శస్త్ర చికిత్స చేసి అద్భుతాన్ని ఆవిష్కరించారు. కనీసం నడవనీయకుండా పెద్దగా పెరిగిపోయిన బోదకాలును తొలగించి ఆమెకు పునర్జన్మను ప్రసాదించారు.
కరీంనగర్ మండలం జూబ్లీనగర్ కు చెందిన సంగోజుల రాజమణి(35) 25 ఏళ్లుగా బోదకాలుతో బాదపడుతోంది. ఆరునెలలుగా ఆ కాలు ఇన్ ఫెక్షన్ కు గురై కొద్ది రోజుల్లోనే 70 కిలోలకు చేరింది. చీము కారుతూ కదల్లేని పరిస్థితి నెలకొంది. మహిళ మంచానికే పరిమితమైంది. హైదరాబాద్ లోని పలు ఆస్పత్రులకు వెళ్లినా శస్త్రచికిత్స చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరకు కరీంనగర్ లోని శ్రీ సాయి లైఫ్ లైన్ ఆస్పత్రి వైద్యులు డా. సీహెచ్ ప్రదీప్ కుమార్ రోగిని పరీక్షించి అరుదైన సాహసోపేతమైన ఆపరేషన్ చేయడానికి నిర్ణయించారు. నాలుగు గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్స చేసి కాలును తొలగించారు. అనంతరం కోలుకున్న మహిళను విలేకరులకు చూపించారు డాక్టర్ ప్రదీప్ కుమార్. ఇంతటి క్లిష్ట ఆపరేషన్ చేసిన ఆస్పత్రి వైద్యులను రోగి కుటుంబ సభ్యులు అభినందించారు.