
విజయనగరం, జూన్ 5( ఎపీఇఎంఎస్):- ఎపీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తాజాగా కాంగ్రెస్‌ను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం కావడంతో ఉత్తరాంధ్రలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. గతంలో కాంగ్రెస్ నుండి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు టీడీపీ నాయకుడు గద్దె బాబూరావు సహకారంతో ప్రయత్నంచి విఫలమైన బొత్స, కాలక్రమంలో కాంగ్రెస్‌లోనే బలపడి మంత్రి పదవుల నుంచి పీసీసీ అధ్యక్షపదవి వరకు ఎదిగారు. రాష్ట్ర విభజన ఉద్యమ సమయంలో రెండు రాష్ట్రాల నినాదాన్ని తలకెత్తుకొని తగిన మూల్యం చెల్లించారు. అధికారానికి, దాని ప్రతిఫలాలకు బాగా అలవాటుపడిన బొత్స అండ్ కంపెనీ అధికారం పోయి ఏడాది గడిచేసరికి ఏమాత్రం ఉండలేకపోయారు. ఈ మధ్యకాలంలో బీజేపీ వైపు చూసినా ఫలితం కనిపించలేదు. ఇదే సమయంలో నానాటికీ నిర్వీర్యమైపోతున్న వైసీపీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా అధినేత జగన్ చివరకు బొత్స వైపు మొగ్గుచూపక తప్పలేదు. బొత్సను చేర్చుకోవడంపై వైకాపాలో తీవ్ర వ్యతిరేకత ఉన్నందున * కొన్ని షరతులతో* చేర్చుకుంటున్నట్లు జగన్ సర్ధిచెప్పుకున్నారు. అయినా బయటకు ఏమీ అనలేకపోయినా అధిక శాతం నేతలు,కార్యకర్తలకు జగన్ వైఖరి మింగుడుపడలేదు. కాగా బొత్స కూడా తనకు మండలి సభ్యత్వం, మండలిలో విపక్ష నేత హోదా కల్పించాలని, దీంతో చంద్రబాబును ఆడుకుంటానని చెప్పినట్లు సమాచారం. అంతేగాక తన రాక వల్ల ఉత్తరాంధ్రతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కాపులను వైకాపా వైపు తీసుకురాగలనని జగన్‌కు భరోసా ఇచ్చినట్లు ప్రచారం సాగుతో్ంది. వాస్తవానికి తూర్పుకావు కులానికి చెందిన బొత్స సత్యనారాయణకు కాపునాడుపై ఏమాత్రం పట్టులేదన్న సంగతి అందరికీ తెలుసు. ఆయన ఒకవేళ అటువంటి ప్రయత్నాలు చేసినా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారు ఏమాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేరన్నది వాస్తవం. ఇక పార్టీ మార్పిడి వ్యవహారానికి వస్తే..బొత్సతో పాటు భార్య, మాజీ ఎంపీ ఝాన్సీరాణి, తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య, బంధువు, మాజీఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు తదితరులు పార్టీ మారనున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది నాయకత్రయాన్ని వైకాపా వైపు తీసుకుపోవడానికి బొత్స యత్నాలు. అయితే బొత్స రాజకీయాల రంగు, రుచి,వాసన తెలిసిన ప్రజలు వీరిని ఏమాత్రం ఆదరిస్తారో చూడాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో బొత్స కంపెనీకి తీవ్ర స్ధాయిలో బుద్ధిచెప్పిన ప్రజల్లో కాంగ్రెస్‌పై ద్వేషం కంటే బొత్సపై అసంతృప్తే అధికంగా కనిపించింది. అందువల్లే బొత్స ఆస్ధులను లక్ష్యంగా పెట్టుకుని దాడులు జరిపిన సంగతి మరచిపోలేము.
ఇక బొత్సను చేర్చుకోవడం ద్వారా లబ్ధి చేకూరుతుందని వైకాపా భ్రమపడుతోంది. జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి పి. సాంబశివరాజుతో పాటు బొబ్బిలి వైకాపా ఎమ్మెల్యే. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి సుజయ కృష్ణ రంగారావు, తెరచాటుగా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు అసంతృప్తితోనే ఉన్నారు. బొత్స చేరిక తర్వాత కొంతమంది వైకాపాను వీడినా ఆశ్చర్యపోనవసరంలేదు. అటు శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులు, ఇటు విశాఖ జిల్లాలో ఊగిసలాటలో ఉన్న కొణతాల రామకృష్ణ వంటి వారు కొత్త ఆలోచనలు చేసినా చేయొచ్చునని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పటకే విశాఖ నగరంలో బొత్సపై ఉన్న అసంతృప్తి పతాక స్ధాయిలో ఉంది. ఇవన్నీ వైకాపాకు ప్రతికూలంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఈనెల 7వ తేదీ ఉదయం 7.45 నిముషాలకు వైకాపాలో చేరాలని బొత్స ముహూర్తం పెట్టుకున్నారు. ఈలోగా కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వాస్తవానికి మూడు రోజుల క్రితమే ఎఐసీసీకి బొత్స రాజీనామా పంపినట్లు కవరింగ్ మొదలైంది. పీసీసీకి పంపకుండా ఆయన ఎఐసీసీకి ఎందుపంపారన్న విషయం చెప్పడంలేదు. కాగా ఇప్పటికీ గుంటూరు సమావేశం నాటికి బొత్స వైఖరిని గమనించిన పీసీసీ ఆయనకు అక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదుసరికదా పార్టీ మారకుండా వత్తిడి తేలేదు. బొత్స వంటివారు పార్టీనుంచి పోతేనే తిరిగి కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయని కాంగ్రెస్‌నేతలు బలంగా విశ్వసించినట్లు భోగట్టా!