బొత్స‌-కోల‌గ‌ట్ల వ‌ర్గాల మ‌ధ్య విభేదాలు తీవ్రం|

వైఎస్‌, బొత్స జ‌న్మ‌దిన వేడుక‌ల్లో బ‌య‌ట‌ప‌డ్డ పోరు
విజ‌య‌న‌గ‌రం :- ఇటీవ‌ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌ధ్యంలో మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి వ‌ర్గాల మ‌ధ్య విభేధాలు తీవ్ర‌మై చివ‌ర‌కు వీధిన ప‌డ్డాయి. వైసీపీలోకి బొత్స చేరిక‌ను ఆది నుంచి బొబ్బిలి ఎమ్మెల్యే సుజ‌య కృష్ణ రంగారావుతో పాటు కోల‌గ‌ట్ల కూడా విభేధించారు. అయితే పార్టీ అధినేత జ‌గ‌న్ వ‌త్తిడి కారణంగా వీరు త‌మ అసంతృప్తిని మ‌న‌సులోనే దాచుకున్నారు. జ‌గ‌న్ త‌న మాట‌తో సుజ‌య్‌, కోల‌గ‌ట్ల‌ను అదుపుచేయ‌గ‌లిగినా.. కార్య‌క‌ర్త‌ల‌ను ఒప్పించ‌లేక‌పోయారు. దాంతో నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి తాజాగా వైఎస్ఆర్ జ‌యంతి నాడు బ‌హిరంగంగా బ‌య‌ట‌ప‌డింది. కోల‌గ‌ట్ల వ‌ర్గం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల‌కు బొత్స వ‌ర్గం దూరంగా ఉంటే.. బొత్స వ‌ర్గం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను కోల‌గట్ల వ‌ర్గం ప‌ట్టించుకోలేదు. అప్ప‌టికే కోల‌గ‌ట్ల వివిధ సంద‌ర్భాల‌లో ఎవ‌రికివారు సొంతంగా పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌రాద‌ని చెప్పిన‌ప్ప‌టికీ బొత్స వ‌ర్గం దానిని లెక్క‌చేయ‌లేదు. దీంతో వైఎస్ఆర్ జయంతి వేడుక‌ల‌లో బ‌య‌ట‌ప‌డిన వ‌ర్గ‌పోరు.9 వ‌తేదీ గురువారం నాడు జ‌రిగిన బొత్స 58వ జ‌న్మదిన వేడుక‌ల‌లో మ‌రింత పెరిగింది. ఇంత‌వ‌ర‌కు రాజ‌కీయ ప‌రిజ్ఞానంలేని చిన్న శ్రీ‌ను వంటి బొత్స కుటుంబీకులకు ప్రాధాన్య‌త‌నిచ్చి, కోల‌గ‌ట్ల‌ను చిన్న‌చూపు చూసేలా ఫ్లేక్సీల‌ను త‌యారు చేయిస్తున్న సంగ‌తి తెలుసుకున్న కోల‌గ‌ట్ల రంగంలోకి దిగి ఫ్లెక్సీ త‌యారీ కేంద్రాల‌కు ఫోన్లు చేసి త‌న ఫోటోల‌ను పెట్ట‌వ‌ద్ద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. అందువ‌ల్లే బొత్స జ‌న్మదిన ఫ్లెక్సీల‌లో కోల‌గ‌ట్ల గాని , అత‌ని వ‌ర్గీయుల ఫోటోలుగాని లేకుండా పోయాయి. బొత్స పేరిట జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు కూడా కోల‌గ‌ట్ల వ‌ర్గీయులు దూరంగానే ఉన్నారు. దీనిని బ‌ట్టి జిల్లా కేంద్రంలో వైసీపీ నిట్ట‌నిలువునా చీలిపోయ‌న‌ట్లు సుస్ప‌ష్ట‌మైంది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో విభ‌జ‌న‌కు అనుకూల వ్యాఖ్య‌లు చేసిన బొత్స‌ను జిల్లా ప్ర‌జ‌లు క‌ఠినంగానే శిక్షించారు. మొత్తం కుటుంబాన్ని ఓడ‌గొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. దీంతో త‌న‌కు, కుటుంబానికి రాజ‌కీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. మ‌రో వైపు ఆగ్ర‌హించిన కాంగ్రెస్ నేత‌లు గాంధీభ‌వ‌న్‌లో పీసీసీ మాజీ అధ్య‌క్షుడైన బొత్స ఫోటోను పీకిపారేశారు. జిల్లాలో త‌మ కుటుంబంపై ప్ర‌జ‌ల నిరాద‌ర‌ణ‌, వైసీపీలో కోల‌గ‌ట్ల‌,సుజ‌య్‌, సాంబ‌శివ‌రాజు, పెద‌బాబు వంటి నేత‌ల అసంతృప్తి నేప‌ధ్యంలో బొత్స హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మై ప‌త్రికాప్ర‌క‌ట‌న‌ల‌తో కాలం వెళ్ల‌దీస్తున్నారు. అయితే బొత్సను గాని, అత‌ని విమ‌ర్శ‌ల‌ను గాని తెలుగుదేశం పార్టీ లెక్క‌చేయ‌కుండా అవ‌మానిస్తోంది. అయినా రాజ‌కీయ పున‌ర్జ‌న్మ కోసం బొత్స వ‌ర్గీయులు జిల్లాలో ల‌క్ష‌లాది రూపాయిలు ఖ‌ర్చు చేసి పున‌:ప‌్రాభ‌వానికి చేస్తున్న ప్ర‌య‌త్నాలు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డంలేదు స‌రిక‌దా వ్య‌తిరేక‌త‌ను మ‌రింత పెంచుతున్నాయి. ఇంత‌వ‌ర‌కు జిల్లాలో త‌మ ఉనికిని చాటుకున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ‌ర్గ విభేధాల‌తో స‌త‌మ‌త‌మ‌వ‌డం గ‌మ‌నార్హం. ఇది పార్టీ తిరోగ‌మ‌నానికి నాందీప్ర‌స్ధావ‌నే.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *