బీహార్లో నితీష్ కు టెన్షన్ టెన్షన్.. !

విజయమో వీర స్వర్గమో అనే స్థాయిలో బీహార్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చాలా కష్టపడుతున్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు గెలుపు నల్లేరు మీద నడకలా ఉండేది. ఇప్పుడు అంతా అనుమానంగా మారింది.

మోడీని ప్రధానిని చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీతో తెగతెంపులు చేసుకున్న జేడీయూ, ఆ తర్వాత లాలుతో చిరకాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి దోస్తీ చేశారు. ఇప్పుడు అదే కారణంతో ఆయనకు ఓటమి ఎదురు కావచ్చనే అంచనాలు నితీష్ కు కలవరం కలిగిస్తున్నాయి.

హర్ ఘర్ దస్తక్ పేరుతో జేడీయూ కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేశారు. పనిలోపనిగా ఓ సర్వే ఫారం నింపారు. అందులో నాలుగు ప్రశ్నలున్నాయి. మొదటిమూడూ నితీష్ పనితీరు ఎలా ఉంది, అభివృద్ధి ఎలా జరిగింది అనేవి. నాలుగోది- మళ్లీ నితీష్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారా అనే ప్రశ్న.

మొదటి మూడు ప్రశ్నలకూ మంచి మార్కులే పడ్డాయట. నాలుగో ప్రశ్నకు మాత్రం మెజారిటీ ఓటర్లు నో చెప్పారట. స్వయంగా జేడీయూ కార్యకర్తలు చేసిన సర్వే ఫలితం ఇలా వచ్చిందట. దీనికి కారణం ఏమిటనే దానిపై నితీష్ ఆరా తీయగా లాలు దోస్తీ అని తేలిందని సమాచారం. లాలు కుటుంబం దాదాపు పదిహేనేళ్లు బీహార్ ను ఏలింది. అప్పట్లో అరాచకత్వం ప్రబలిందని, రౌడీ రాజ్యం నడిచిందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతెందుకు, నితీష్ కుమార్ కూడా అప్పట్లో జంగల్ రాజ్ అంటూ లాలు పాలనపై విరుచుకు పడ్డారు.

ఇప్పుడు నితీష్ గెలిచినా, తెరవెనుక లాలు హవా నడుస్తుందని, జంగల్ రాజ్ వస్తుందేమో అని బీహారీలు భయపడుతున్నారనేది ఓ అంచనా. లాలు కుటుంబ పాలనలోని అనేక సంఘటనలను బీజేపీ కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తున్నారు. లాలు రెండో కూతురి పెళ్లి సందర్భంగా కొందరు రౌడీలు పాట్నాలోని కార్ల షోరూంల మీద పడి, అద్దాలు ధ్వంసం చేసి కార్లను ఎత్తుకు పోయారు. వారు లాలు పార్గీ వారే అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అది అబద్ధం, మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రతిపక్షాలు పన్నిన కుట్ర అని లాలు ఎదురు దాడి చేశారు. అయినా అలాంటి ఘటనలు ప్రజలను ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నాయి. లాలు వల్ల మైనారిటీ, యాదవ ఓట్లు ప్లస్ అయినా, ఇతర వర్గాల ఓట్లు మైనస్ కావచ్చని జేడీయూ నేతలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.

హాయిగా బీజేపీతో పొత్తు కొనసాగించి ఉంటే సునాయాసంగా గెలిచేవాళ్లమని ఇప్పుడు నితీష్ అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా బీజేపీ నేతలు ఎప్పుడూ సంకీర్ణ ధర్మాన్ని తప్పలేదని, అన్నివిధాలా సహకరించే వారని గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి ఓడిపోతే నితీష్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే లాలుతో చేతులు కలిపారు. అదే కొంప ముంచే లాగుందని ఇప్పుడు టెన్షన్ పడుతున్నట్టు జేడీయూ వర్గాలు చెప్తున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.