
ఢిల్లీ , ప్రతినిధి : బీమారంగంలో ఎఫ్ డీఐలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. బీమారంగంలో 49 శాతం ఎఫ్ డిఐల ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పార్లమెంట్ ముగిసిన మరుసటి రోజే ఆర్డినెన్స్ ద్వారా బీమారంగంలోకి 49శాతం ఎఫ్ డిఐలను ఆహ్వానించడానికి నిర్ణయించారు. అంతకముందే ఈ బిల్లుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బిల్లును సభలో ప్రవేశపెడితే ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన కేంద్రం… సభలో బిల్లును ప్రవేశపెట్టలేదు. ఆర్డినెన్స్ ద్వారా బిల్లును తీసుకు వచ్చారు.
బీమారంగంలోకి 49 శాతం ఎఫ్ డిఐలను ఆహ్వానించడాన్ని ఆలిండియా ఇన్సూరెన్స్ యూనియన్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. గత యుపిఎ ప్రభుత్వ హయాంలోనే ఎఫ్ డిఐలను 26 శాతం నుంచి 49 శాతం వరకు పెంచాలని ప్రయత్నాలు జరిగాయని.. నాడు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో యశ్వంత్ సిన్హా వ్యతిరేకించారని తెలిపారు. గతంలో వ్యతిరేకించిన బిజెపి ప్రస్తుతం ఆమోదించడం ఎంతవరకు సమంజసమని ఇన్సూరెన్స్ ఏజెంట్లు తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. దీన్ని వ్యతిరేకిస్తూ… ఒక రోజు సమ్మెకు పిలుపు ఇస్తున్నట్లు తెలిపారు.